వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అంబటి, మేడా, ఆకేపాటి
పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాత్రికులు
నేడు ధ్వజారోహణం
ప్రజాశక్తి-ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 30 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు వేదపండితులు, అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. బాజాభజంత్రీలు నడుమ వేదపండితుల మంత్రోచచరణ్లలతో అంకురార్పణం చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హారతి ఇచ్చారు. కేరళ వాయిద్యకారులు ప్రదర్శన పలువురిని ఆకట్టుకొంది. కార్యక్రమంలో టిటిడి డిప్యూటి ఇఒ నటేష్‌బాబు, సూపరింటెండెంట్లు వెంకటేశయ్య, ఆర్సి సుబ్రమణ్యం, కంకణ భట్టార్ కెహెచ్.రాజేష్‌కుమార్, ముఖ్య వేద పండితులు రాజేష్ భట్టార్, ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు, అర్చకులు పవన్‌కుమార్, వేద పండితులు పాల్గొన్నారు.
వైభవంగా నవమి వేడుకలు : ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏకశిలపై వెలసిన సీతారామ, లక్ష్మణలను యాత్రికులు వేకువజాము నుండే దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తులను వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన పూలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను తిరుమాడ వీధిలో ఊరేగించారు.
పట్టువస్త్రాల సమర్పణ : బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరామనమి నాడు రాములోరికి ప్రభుత్వం తరపున మంత్రి అంబటి రాంబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు టిటిడి అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో పట్టు వస్త్రాలను సీతారాములకు సమర్పించారు. అనంతరం గర్భగుడిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలను సమర్పించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి దంపతులు కూడా శ్రీ కోదండరామస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పెన్నా సిమెంట్ అధినేత వేణుగోపాల్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ముమ్మడి శ్రీధర్‌రెడ్డి నాయకులు అకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, నాయుడు ఉన్నారు.
తలంబ్రాల తయారీ ప్రారంభం : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఎసి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి హాలులో రామసేవకులు బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు రెండు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.
నేడు ధ్వజారోహణం : శుక్రవారం ఉదయం 9 గంటలకు వృషభలగంలో ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.
5న శ్రీ సీతారాముల కల్యాణం : ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు. ప్రజలు రూ.750 చెల్లించి కల్యా ణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.










