Feb 10,2023 22:53

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి నేతలు

రాకేష్‌పై ఎస్‌ఐ తీరు దుర్మార్గం
- టిడిపి వాణిజ్యం విభాగం నేతలు
ప్రజాశక్తి-కావలి : చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్‌పై ఎస్‌.ఐ. అనిల్‌ చేయి చేసుకోవడం దుర్మార్గమని టిడిపి నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం నిర్వహించిన సమావేశంలో టిడిపి వాణిజ్య విభాగం నేతలు ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసుకుంటారని, సభలు పెట్టుకుంటారని అంతేకానీ ఈ విధమైన దౌర్జన్యం చేయడం, చేయి చేసుకోవడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
ఎస్‌ఐ అనిల్‌ వైసిపి నాయకుడిలా ప్రవర్తించడం బాధాకరమని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నారాలోకేష్‌ యువగళం పాదయాత్రని చూసి, అక్కడకు వచ్చే ప్రజలు, కార్యకర్తలను చూసి ఓర్వలేక అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం మంచి పద్ధతి కాదన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా లోకేష్‌ పాదయాత్ర దిగ్విజయమవుతుందని పేర్కొన్నారు. వ్యాపార వర్గాల సమస్యలు తెలుసు కోవడం కోసం నారా లోకేష్‌ అన్నతో కలిసి యువగళం పాదయాత్రలో నడుస్తున్న డూండీ రాకేష్‌పై చేయి చేసుకున్న పోలీసు అధికారి అనిల్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసు వారు టిడిపి నాయకులను కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే తదుపరి పార్టీ చేపట్టే చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి తటవర్తి వాసు, జిల్లా అధికార ప్రతినిధి బొగ్గవరపు శ్రీనివాసరావు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కోటా రమేష్‌, ప్రధాన కార్యదర్శి చవల మురళి, ఆర్యవైశ్య ప్రముఖులు, సీనియర్‌ కార్యకర్త చవల రామకృష్ణ, వాయుగుండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.