సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నాయకులు
ప్రజాశక్తి-సుండుపల్లె : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, నరసింహులు అన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిని రాజకీయ ప్రచార భేరిలో భాగంగా మంగళవారం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ప్రతీ వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. మోడీ, అమిత్ షాల నాయకత్వంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ప్రజలనుధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తున్నదని విమర్శించారు. మరోవైపు అదానీ, అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. ప్రశ్నించే ప్రతీ ఒక్కరినీ నిరంకుశంగా అణచివేస్తున్నారని చెప్పారు. పేదలకు, సామాన్య ప్రజలకు అండగా ఉండడం పోయి వారిమీదే మోయలేనంత భారాలను మోపుతున్నది మోడీ ప్రభుత్వం, గ్యాస్ బండ మనకు గుదిబండ్ల అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే షాకులు కొరుతున్నాయన్నారు. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మన బతుకులను చిదిమేస్తున్నాయని తెలిపారు. నిత్యవసర ధరలు కొండెక్కాయన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న అన్న మాటలు నేడు నీటి బుడగలుగా తయారైందని పేర్కొన్నారు.నిరుద్యోగుల బతుకులు అగాధంలోకి జారిపోతున్నాయని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు. ఇవ్వడం లేదనీ, పేదలకు విద్య, వైద్యం అందనంత ఖరీదైపోయి కార్పొరేట్ వ్యాపారంగా మారిపోయాయన్నారు. గ్రామీణ పేదలకు ప్రాణాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సైతం మోడీ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. మహిళలకు రక్షణ లేకపోగా దాడులు, అత్యాచారాలు పెద్దఎత్తున పెరిగాయన్నారు. దళిత, గిరిజన ప్రజలు సంక్షేమానికి, సామాజిక న్యాయానికి దూరమైపోతున్నారని పేర్కొన్నారు. కుల విద్వేషం, పెత్తందారీతనం, మనువాద శక్తుల అండతో పేట్రేగిపోతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజనేయులు, డి.వెంకట్రామయ్య, లంబాడ సంఘం జాతీయ నాయకులు మూడే శంకర్ నాయక్, సోషలిస్టు పార్టీ నాయకులు పల్లం నాగేంద్ర, నాయకులు అరుణ్, అఫ్రీద్, గనీంద్ర, నవీన్, మల్‌రెడ్డి, మల్లికార్జున నాయుడు, రాజానాయక్, ఓబులేసు, అశోక్, ఆనంద్, నాగేంద్ర, రాంబాబు, కృష్ణ పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్ : ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణ దేవరా అన్నారు. ప్రచార భేరిలో భాగంగా బోయినపల్లిలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, కందుల సుబ్బయ్య, వాసు, ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు.










