Mar 27,2022 13:15

రాజు, రవి మంచి స్నేహితులు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవారు. ప్రతిరోజూ కలిసే స్కూల్‌కి వెళ్లేవారు. కంచనపల్లి పాఠశాలలో రాజు ఆరో తరగతి, రవి ఏడో తరగతి చదువుతున్నారు. చదువులో ఇద్దరూ ముందే ఉంటారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఇద్దరూ కలిసి సరదాగా ఊరుకు కొద్ది దూరాన ఉన్న బావి దగ్గరికి వెళ్లారు. అక్కడ అడవిని తలపించేలా చెట్లు ఉన్నాయి. దీంతో అలా నడుచుకుంటూ వెళ్తూ చుట్టు పక్కల ప్రకృతిని ఆస్వాదించారు. అక్కడ ఉన్న పూల చెట్లను, వింతైన పక్షులను, జంతువులను, పచ్చదనం అందాలను తనివితీరా చూశారు. ఆటల్లో పడి సమయాన్ని మరిచారు. ఈలోగా సూర్యుడు కనిపించకుండా పోవడంతో చీకటి పడింది. దీంతో 'పొద్దు గూకింది.. పోదాం పద....! అనుకున్నారు' రాజు, రవి. తిరిగి ఇంటికి వెళ్తేందుకు పయనమయ్యారు.
    చీకటి పడటంతో ఇద్దరూ ఆదరాబాదరాగా నడుచుకుంటూ తిరిగి ఊరు దిక్కుకు పయనమయ్యారు. పక్షులు, జంతువులు తమ తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. ఎప్పుడూ వినని పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు వారి మదిలో వింతగా అనిపించింది. ఓ వైపు ప్రకృతిని ఆస్వాదిస్తూనే.. మరోవైపు వింత శబ్ధాలకు బిక్కు బిక్కుమంటూ నడవసాగారు. ఇంతలో ఒక పొదచాటు నుంచి పులి గాండ్రింపు వినబడింది. ఇద్దరూ భయపడిపోయారు. ఈలోగా పులి సమీపంలో నుంచి వీరి వైపుకు రావడాన్ని గమనించారు. ఏం చేయాలో తోచలేదు ఇద్దరికీ. కొన్ని క్షణాల్లోనే భయంతో రాజు చకచకా దగ్గర్లో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. కానీ తన స్నేహితుడు రవిని చెట్టుపైకి లాగాలన్న ఆలోచన కూడా చేయలేదు. రవి కాస్తంత లావుగా ఉండటంతో ఎంత ప్రయత్నించినా చెట్టు ఎక్కలేకపోయాడు. భయంతో వణికిపోతూ ఉండగానే ఎదురుగా పులి రావడం గమనించాడు.
    రవికి ఓవైపు భయం వేస్తున్నా.. మరోవైపు తప్పించుకోడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందేమోనని చుట్టూ పరిశీలించసాగాడు. వెనుక వైపు పెద్ద గొయ్యి కనబడింది. పులి బారినుండి తప్పించుకోవడం ఎలా? అని ఆలోచించి, పులి తన మీదకు వచ్చే తరుణంలో ఒడుపుగా పక్కకు తప్పుకున్నాడు. పులి వేగంగా వెళ్లి ఆ గోతిలో పడింది. ఈలోగా రాజు చెట్టు దిగొచ్చి...'భలే తప్పించుకున్నావు.. నీకు మెరుపులాంటి ఆలోచన ఎలా వచ్చింది?' అని రవిని అడిగాడు.
    'నీలాంటి నమ్మకద్రోహులతో, స్నేహం చేయడం వల్ల బుద్ధి వచ్చింది. చిన్నప్పుడు మా నాయనమ్మ ఆపద సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించాలి అని ఒక చిటికు చెప్పింది. అది గుర్తుకు వచ్చి, చటుక్కున పక్కకు తప్పుకున్నాను. పులి బారినుండి బయటపడ్డాను. నీవు కనీసం స్నేహితుని రక్షించే ప్రయత్నం కూడా చేయలేదు' అని రవి అన్నాడు. రాజు వెంటనే తన తప్పు తెలుసుకుని తలదించుకున్నాడు. 'మరోసారి అలా వ్యవహరించను. నన్ను క్షమించు' అని బ్రతిమిలాడాడు. రవి క్షమించాడు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. మరుసటిరోజు స్కూల్‌కి వెళ్లి తన మిత్రులతో జరిగిన విషయం గురించి చెబుతూ... 'ఒంటరిగా, దూరంగా వెళ్లినప్పుడు కడు జాగ్రత్తగా ఉండాలి' అని రవి చెప్పుకొచ్చాడు.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655