Apr 11,2023 21:07

ఎమ్మెల్యే మేడాకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు


విభేదాలు మరోసారి బహిర్గతం
ఎమ్మెల్యే 'మేడా'కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌: రాజంపేట వైసిపిలో రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గ్రూపుల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతున్న విషయం తెలిసింది. ఎమ్మెల్యే టికెట్‌ విషయమైన చోటు చేసుకున్న వివాదానికి ఇంకా తెరపడలేదనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నిర్వహించిన పంచాయితీలో ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదిరింది. ఇద్దరూ కలిసి కార్యక్రమాలకు హాజరయ్యే వారు. పైకి కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నా లోపల ఎవరికి వారు విభేదించుకుంటూ ఉండేవారని జోరుగా ప్రచారం ఉంది. తాజాగా మంగళవారం రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డికి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు వెలిశాయి. పట్టణంలో అక్కడక్కడా 'మా నమ్మకం నువ్వే జగనన్న, కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మీ మీద మాకు నమ్మకం లేదు' అని సంబోధిస్తూ ఇట్లు మోసపోయిన వైసిపి నాయకులు, కార్యకర్తలు' అంటూ గోడల మీద పోస్టర్లను అంటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న నువ్వే మా భవిష్యత్తు'- మా నమ్మకం నువ్వే జగన్‌' అనే కార్యక్రమానికి సంబంధించిన టైటిల్‌ను వినియోగించుకొని ముఖ్యమంత్రిపైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అదే సమయంలో ఎమ్మెల్యేపైన విశ్వాసం లేదంటూ నిరసన రూపంలో పోస్టర్లను అంటించడం పట్టణంలో చర్చనీయాంశమైంది. వెంటనే తేరుకున్న మేడా అనుచరులు పోస్టర్లను తొలగించారు. మేడా అనుచరుల్లో అసంతృప్తి వర్గం ఈ పని చేశారా? మేడా వ్యతిరేకవర్గం చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గ్రూపునకు చెందిన వారే ఇలా పోస్టర్లు అంటిచారనే వాదన కూడా ప్రచారంలో ఉంది.