ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : రాజకీయ తీర్మానాన్ని హర్షధ్వానాల మధ్య సిపిఎం 23వ మహాసభ ఆమోదించింది. రెండురోజులపాటు ముసాయిదా రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ చర్చకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమాధానమిచ్చారు. మహాసభకు ముందు, మహాసభ లోనూ వచ్చిన సవరణలు, సూచనలు అధికభాగం తీర్మాన స్ఫూర్తిని బలపరిచేవని చెప్పారు. మహాసభ సందర్భంగా ప్రతినిధులు ఇచ్చిన సవరణల్లో ఆమోదించిన వాటి వివరాలను, మిగిలిన వాటి స్ఫూర్తిని తీసుకోవడం గురించి సవివరంగా తెలియజేశారు. తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. దీనిని అధ్యక్షవర్గం ఆమోదానికి పెట్టడంతో ప్రతినిధులు చేతులెత్తి ఆమోదాన్ని తెలియ జేశారు. రాజకీయ తీర్మానం ఆమోదం పొందినట్లు హర్షధ్వానాల మధ్య అధ్యక్షవర్గం ప్రకటించింది.
చర్చలో 35 మంది
ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చల్లో మొత్తం 35 మంది పాల్గొని, తమ అభిప్రాయాలు తెలిపారు. మహాసభలో తీర్మానానికి 350 సవరణలు, 12 సూచనలు అందాయి. రెండవ రోజు జరిగిన చర్చల్లో తెలంగాణ నుంచి అబ్బాస్ పాల్గొన్నారు.










