Jul 08,2023 21:53

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న పట్టు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు ధనాపురం వెంకట్రామిరెడ్డి

       హిందూపురం : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పోందాలనే ఉద్ధేశంతో కామన్‌ సివిల్‌ కోడ్‌ చట్టాన్ని తెరపైకి తెచ్చిందని ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు. శనివారం పట్టణంలోని బాలాజీ మనోహర్‌ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమర్‌ ఫారూఖ్‌ఖాన్‌ అధ్యక్షతన కామన్‌ సివిల్‌ కోడ్‌ చట్టాన్ని వ్యతిరేఖిస్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు బాలాజీ మనోహర్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ, సిపిఐ వినోద్‌ కుమార్‌, చైతన్య గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారతీయ మూలాలకు వ్యతిరేకంగా బిజెపి పాలన సాగిస్తోందన్నారు. దేశాన్ని కులం, మతం పేరుతో విచ్ఛిన్నం చేసి, భారత దేశాన్ని ఆస్థిరత్వంలోకి నెట్టే ఉమ్మడి పౌర సంస్క్తృతి కామన్‌ సివిల్‌ కోడ్‌ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలన్నారు. అన్ని పార్టీలూ ఈ చట్టంపై తమ అభిప్రాయం బయట పెట్టాలన్నారు. రాష్ట్రంలో వ్యతిరేకించి పార్లమెంట్‌లో దొంగచాటుగా దీనికి ఓటు వేసే విధాన్ని పార్టీలు విడనాడాలన్నారు. ఎన్నికల సమయంలో అభివద్ధి, నిత్యావసర ధరలపై ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే బిజెపి ఇలాంటి చట్టాన్ని తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, జాతులను పక్కన పెట్టి ఐకమత్యంతో దేశాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సతీష్‌ కుమార్‌, తలహాఖాన్‌, ఉబెదుల్లా హుస్సేన్‌, రవూఫ్‌, విశ్రాంత తహశీల్దార్‌ దేవాదాస్‌, సిపిఐ నాయకులు ఇస్మాయిల్‌, ఆంజినేయులు, ఆనంద్‌, నాగార్జున, కాంగ్రెస్‌ నాయకులు అమానుల్లా, జమీల్‌, యునూస్‌ తదితరులు పాల్గొన్నారు.