Jul 17,2021 20:02

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత యడియూరప్ప ఖండించారు. తన రాజీనామాపై వస్తున్న ఊహాగానాల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. కొనసాగుతున్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర నాయకత్వంతో జరుగుతున్న భేటీల్లో అటువంటి ప్రస్తావనేదీ రాలేదని పేర్కొన్నారు. శనివారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాతో సమావేశం అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో రాజీనామా చేస్తానని చెప్పారని మీడియాలో వచ్చిన వార్తలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ' లేదు. అటువంటిదేమీ లేదు. ఆ పుకార్లలో వాస్తవం లేదు' అని అన్నారు. కర్ణాటకలో ప్రాజెక్టులు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఇటీవల సొంత పార్టీకి చెందిన నేతలే యడియూరప్ప, ఆయన కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే యడియూరప్ప, ఆయన కుమారుడు విజేయంద్ర శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు.