Feb 04,2023 19:56

మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి

జూనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : రాజీమార్గమే రాచమార్గమని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సంధ్యారాణి అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచివారిపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ అయిన సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు సూచించారు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమతలేని పేదవారికి ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రొనోట్‌ కాల వ్యవధి మూడు సంవత్సరాలని, డబ్బులు తీసుకుని ఎవరైనా గడువు లోపల చెల్లించని పక్షంలో కోర్టులో ఫైల్‌ చేసుకుని తిరిగి డబ్బులు పొందవచ్చునని తెలిపారు. సంబంధం లేని వ్యక్తులు మన ఖాతా నుంచి డబ్బులు దొంగిలించినప్పుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాలని పేర్కొన్నారు. న్యాయవాది వి.నాగేశ్వర చౌదరి మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు అనేక హక్కులు, బాధ్యతలు కల్పించిందన్నారు. ఎవరైనా మన హక్కులకు భంగం కలిగించినప్పుడు కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, కోర్టు సిబ్బంది మధుసూదన్‌, శ్రీనివాసులు, ప్రజలు పాల్గొన్నారు.