- సదుపాయాల కల్పనకే రూ.5,674 కోట్లు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : హైకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఎంతమందికి ప్లాట్లు ఇవ్వాలి, ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై హైకోర్టుకు ఆర్డర్ కాపీలో పొందుపరిచారు. దీని ప్రకారం సదుపాయాల కల్పనకు రూ.5,674 కోట్లు, కన్సల్టెన్సీల కోసం రూ.323 కోట్లు, వడ్డీలకు రూ.1039 కోట్లు చెల్లించారు. పూలింగుకు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు కింద రూ.798 కోట్లు చెల్లించారు. భూమిలేని పేదల కోసం రూ.308.77 కోట్లు వెచ్చించారు. భూ సమీకరణ ఖర్చుల కింద రూ.429 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.8,572.19 కోట్లు వెచ్చించారు. దీనిలో సాదుపాయాల కల్పన కింద ఖర్చు చేసిన రూ.5,674 కోట్లలో ఐజిసి భవనాలకు రూ.580 కోట్లు, సాదర ఖర్చులకు రూ.14 కోట్లు, హౌసింగ్ ప్రాజెక్టుకు రూ.1,304, హైకోర్టుకు రూ.155 కోట్లు, ప్రాజెక్టు ఆఫీసుకు రూ.43 కోట్లు, ఎజిసిలో సదుపాయాలకు రూ.34 కోట్లు, టవర్ల నిర్మాణానికి రూ.332 కోట్లు వెచ్చించారు. అలాగే విద్యుల్ లైన్లను మార్చడం కోసం రూ.191 కోట్లు చెల్లించారు. అలాగే ట్రంక్, బ్లూ అండ్ గ్రీన్ సదుపాయాలు, కన్సల్టెన్సీలకు, పిఎంసి ఛార్జీలకు కలిపి రూ.2,569 కోట్లు వెచ్చించారు. దీంతోపాటు భూ సమీరణ కింద తీసుకున్న భూములు తిరిగి ఇచ్చే ప్లాట్లలో సదుపాయాల కోసం రూ.448 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు మొత్తం 64709 ప్లాట్లను ఇవ్వాల్సి ఉండగా 39,769 ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన వాటికి రిజిస్ట్రేషన్లు చేసినా, చేయకపోయినా కోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా సదుపాయాలు కల్పించాల్సి ఉంది.










