Dec 18,2020 08:03

         నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట ఐదేళ్ల క్రితం భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతులకు, ఉపాధి కోల్పోయిన ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారం చూపకపోవడం దారుణం. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ఒక రంగుల కలను చూపించి సుమారు 37 వేల ఎకరాల సుక్షేత్రాల్ని సాగుదార్ల నుండి సర్కారు గుంజుకుంది. సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందాలు, భారీ రోడ్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఆరుబయట ఎ.సి లు... ఇలా ఎన్నో విధాలుగా ఆ రాజధానిని ఒక 'భ్రమరావతి'గా ఆనాటి ప్రభుత్వం మార్చింది. ప్రకటనలు, పర్యటనల ఆర్భాటమే తప్ప ఆచరణలో రాజధాని నిర్మాణం అరకొరగా, తాత్కాలిక భవనాలతోనే సరిపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఆ రంగుల కల గురించే చెబుతున్నారు తప్ప ఆచరణాత్మక రాజధాని నిర్మాణం గురించి మాట్లాడకపోవడం నయ వంచన. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధానిని అంగీకరించిన వైసిపి అధికార పీఠాన్నెక్కాక మూడు రాజధానుల సిద్ధాంతం ముందుకు తేవడం అసంబద్ధం. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు, ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగి ప్రారంభించిన ఉద్యమానికి ఇప్పటికి ఏడాది పూర్తయింది. రాజధాని ప్రాంత భూములను ఏం చేయనున్నారో, రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు ఎప్పుడు, ఎలా ఇస్తారో వంటి అంశాలను కానీ, ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో రైతులతోగాని ఆ ప్రాంత ప్రజలు లేదా వారి ప్రతినిధులతో ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఏనాడూ చర్చించకపోవడం క్షంతవ్యం కాదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ విమర్శనాస్త్రాలు సంధించడమే తప్ప దోషులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నదే లేదు. చట్ట ప్రకారం రైతులకు, ఉపాధి కోల్పోయిన ప్రజలకు కౌలు, పెన్షన్లు సైతం సకాలంలో చెల్లించని దుస్థితి రావడం దారుణం. రాజధాని ప్రాంతంలోని పారిశుధ్య కార్మికులకు ఈ కరోనా కష్ట కాలంలో కూడా ఏడెనిమిది నెలలపాటు జీతాలివ్వకపోవడం అమానుషం. ఇటువంటి వాటన్నిటి కోసం ఆందోళనలు చేయవలసి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం ఒక నిరంతర వ్యవస్థ. అది టిడిపినా లేక వైసిపినా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రజలకు జవాబుదారీ రాష్ట్ర ప్రభుత్వమే !
         ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని గొప్పగా చెప్పిన ప్రధాని మోడీ చెంబుడు నీళ్లు చల్లి, పిడికెడు మట్టి కొట్టి వెళ్లిపోయారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులివ్వాల్సిన కేంద్రం నామమాత్రంగా విదిలించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు తదితర హామీలతో సహా అన్నిటినీ గాలికొదిలేసి బిజెపి కేంద్ర ప్రభుత్వం దగా చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికేమీ సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం బాధ్యతా రహితం. ఇన్ని మాటలు మార్చిన బిజెపి తాజాగా అమరావతిలోనే రాజధాని అనీ, ఐదు వేల కోట్ల రూపాయలతో దాన్ని నిర్మిస్తామనీ చెప్పడం మహా మోసం. కేవలం ఐదు వేల కోట్లతో 37 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల సమస్యలెలా పరిష్కారమవుతాయోనన్న వివరణ లేనే లేదు.
        ఆరున్నర సంవత్సరాలుగా ఢిల్లీ గద్దెపైనున్న బిజెపి, విభజిత రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించిన టిడిపి, ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న వైసిపి- ఈ మూడు పార్టీలూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయి. అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించే నమూనా రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేయదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలనీ, పరిపాలనా రాజధానిని పరిమిత ప్రాంతంలో నిర్మించాలని 2014 నాటి నుండీ చెబుతూ తన నిబద్ధ వైఖరిని సిపిఎం కొనసాగించడం ముదావహం. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు వ్యాజ్యాలు విడనాడి అన్ని ప్రాంతాలకూ కేంద్రంగా ఉన్న అమరావతిని శాసనసభ, పరిపాలనా భవనాలతో రాజధానిగా కొనసాగించడం విజ్ఞత అవుతుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం మంచిదే !  ఏడాది కాలంగా ఆందోళనలు సాగిస్తున్న రాజధాని ప్రాంత ప్రజలతో ప్రభుత్వం వెంటనే చర్చించి, వారి కోర్కెలు పరిష్కరించాలి. చట్ట ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం నుండి వాటిని రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అందుకు ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలి.