ప్రజాశక్తి-విజయవాడ: సింగ్‌నగర్ 62వ డివిజన్ రాధానగర్ ఏడు అపార్ట్‌మెంట్లలోని మూడు అపార్టుమెంట్స్‌కు మంచినీటిని సరఫరా చేయాలని స్థానిక నివాసులు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. వరుసగా బిందెలు పెట్టి మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని, అధికారుల వైఖరి నశించాలని, ప్రజల ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, అదికారులు పట్టించుకోవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. కార్యక్రమానుద్దేశించి సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణరావు మాట్లాడుతూ...గత నాలుగు మాసాల నుంచి ఏడు అపార్టుమెంట్స్‌లోని 5, 6, 7 అపార్టుమెంట్స్‌కు మంచినీరు రానందున 100 కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాకాలంలో కూడా మంచినీటికి తిప్పలు తప్పడం లేదన్నారు. మరీ ముఖ్యంగా ఆదివారంసెలవు రోజుల్లో ప్రజలందరూ ఇళ్ల వద్ద ఉంటారని, అటువంటి సమయములో మరింత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానిక నివాసులు, సిపిఎం వారు పలు సార్లు సంబంధిత అధికారులను అడిగినా ప్రయోజనం ఉండటం లేదని, తాత్కాలిక ఉపశమనంగా విఎంసి ట్యాంక్‌ల ద్వారా ఒకటి, రెండు ట్యాంక్‌ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నా స్థానికంగా ఉన్న 100 కుటుంబాల ప్రజలకు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంచినీటి పైపులైన్లు మార్చాలని సంబంధిత వాటర్ వర్క్ అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నా వారిలో ఎటువంటి చలనం ఉండటం లేదని విమర్శించారు. కొత్త వాటర్‌పైప్‌లైన్లు వేశామని చెప్తూ అధికారులు చేతులు దులుపుకునే పనిలో ఉన్నారని, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడానికి గల కారణాలను పరిశీలించి, దాని పరిష్కారానికి విఎంసి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై తమ పార్టీ పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని అన్నారు. గత నాలుగు మాసాల నుంచి మంచినీరు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు సోధ్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికయినా మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచినీటి సమస్యతో పాటు శానిటేషన్, దోమలబెడద ఎక్కువుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు చింతల శ్రీనివాస్. ఎస్.కే. నిజాముద్దీన్, పి.సాంబిరెడ్డి జె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










