Feb 17,2022 18:43

చండీగఢ్ :  మరో రెండు రోజుల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. దీంతో అన్ని రాజకీయపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మోడీ నేతృత్వంలోని గుజరాత్‌ మోడల్‌ తెస్తామంటూ బిజెపి, ఢిల్లీ మోడల్‌ చూస్తారంటూ ఆప్‌ అధ్యక్షుడు కేజ్రీవాల్‌లు ఊదరగొడుతున్నారు. మరోవైపు రెండు పార్టీలకు ధీటుగా ప్రియాంక, రాహుల్‌ గాంధీలు కూడా ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అమరీందర్‌సింగ్‌ ప్రస్తావన తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ అయిష్టత ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌ చివరి కంచుకోట అయిన పంజాబ్‌లో అధికారం దక్కించుకునేందుకు యత్నిస్తోంది.

ఈ నెల 13న సంగూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మొదటిసారిగా ప్రియాంకగాంధీ అమరీందర్‌ సింగ్‌ గురించి మాట్లాడారు. అమరీందర్‌ హయాంలో రాష్ట్రంలో తప్పులు జరిగాయని తాము తెలుసుకున్నామని, అందుకే పార్టీ నాయకత్వంలో మార్పులు చేశామని అన్నారు. అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మోడీ ఆదేశాల మేరకు పనిచేసిందని అన్నారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వమార్పులు జరిగాయని .. ఇక నుండి రాష్ట్ర పాలన పంజాబ్‌ నుండే జరుగుతుందని, ఢిల్లీ నుండి కాదని అన్నారు. మీలో ఒకరైన చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించామని, ఆయనకు ప్రజల సమస్యలు తెలుసునని అన్నారు.

రెండు రోజుల అనంతరం పటియాలాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ కూడా ఇంచుమించు ఇవే వ్యాఖ్యలు చేశారు. అమరీందర్‌ సింగ్‌కి బిజెపితో సంబంధాలు ఉన్నాయని తెలియగానే ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం తొలగించిందని అన్నారు. కాంగ్రెస్‌ విధానాలను రాష్ట్రంలో అమలు చేయడాన్ని అమరీందర్‌ సింగ్‌ తిరస్కరించారని అన్నారు. పంజాబ్‌లో తలెత్తిన విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని తాను చెప్పానని, అయితే ఆ సంస్థలతో ఒప్పందాలు జరిగాయని చెప్పారని అన్నారు. ఒప్పందం పేరుతో ప్రజలను పట్టించుకోరా అని సూటిగా ప్రశ్నించానని అన్నారు. అమరీందర్‌ రాజీనామా అనంతరం సిఎంగా బాధ్యతలు చేపట్టిన చన్ని కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలను అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించారని అన్నారు. నాలుగేళ్ల పాలనలో అమరీందర్‌ సాధించలేని లక్ష్యాలను నాలుగునెలల్లో చన్ని సాధించారని ప్రశంసించారు.

రాహుల్‌, ప్రియాంకలు కేవలం అమరీందర్‌ని మాత్రమే కాకుండా.. సెప్టెంబర్‌ 21 వరకు ఉన్న కాంగ్రెస్‌ హయాంలో జరిగిన పాలనా విధానాలను కూడా తిరస్కరించేందుకు యత్నిస్తున్నారు.  మరోవైపు అమరీందర్‌ సింగ్‌ కూడా అదేస్థాయిలో  కాంగ్రెస్‌ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. ఈ వారం ప్రారంభంలో మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్‌ మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్‌ అధిష్టానం తనకు సంకెళ్లు వేసిందని అన్నారు. గతంలో తాను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యానని, 40 మంది అవినీతి నేతల జాబితాను ఆమె దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అయితే సోనియా స్పందించలేదని.. వారిపై చర్యలు తీసుకుని ఉంటే తాను మరో పార్టీని ప్రకటించాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. దీంతో అమరీందర్‌, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తిరస్కరించడం ద్వారా పార్టీ చివరి కంచుకోటగా భావించే పంజాబ్‌ ఓటర్ల ఆగ్రహం నుండి కాంగ్రెస్‌ను రక్షించుకునేందుకు రాహుల్‌, ప్రియాంకలు శతవిధాలుగా యత్నిస్తున్నారు.

అలాగే అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌, బిజెపి, మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దహిండ్సా నేతృత్వంలోని ఎస్‌ఎడి (సంయుక్త్‌) కూటమి నుండి కాంగ్రెస్‌ ఓట్లు చీలకుండా రక్షించుకునేందుకు వీరిద్దరూ యత్నిస్తున్నారు. మొదటి దళిత సిఎం చన్నీ యే నంటూ ఓటర్లకు సందేశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా చన్నితో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల చన్ని ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ బిల్లులను తగ్గించామని, 2015 నాటి బలిదానాల కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటి)ని ఏర్పాటు చేశామని, అవినీతికి వ్యతిరేకంగా ఎస్‌ఎడి నేత బిక్రమ్‌ మజిథియా నేత చుట్టూ ఉచ్చు  బిగించామని, చిన్న రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసామని ప్రకటించుకుంటున్నారు.

పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగుతుండగా, మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టాలంటే 59 సీట్లను సాధించాల్సివుంటుంది.