లక్నో : పార్టీ ఏదైనా 30 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో గెలుపు ఆ ఒక్క కుటుంబానిదే. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాయ్ బరేలి సర్దార్ అసెంబ్లీ స్థానం. 1993 నుండి ఈ నియోజకవర్గంలో అఖిలేశ్ సింగ్, ఆయన కుమార్తె ఆదితిసింగ్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడుగా పేరొందిన అఖిలేశ్ సింగ్ 1993లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో రారుబరేలీ సర్దార్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన విజయాల పరంపర కొనసాగింది. 1996, 2002లోనూ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత అఖిలేశ్ సింగ్‌కు కాంగ్రెస్‌తో విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ ఆయనను బహిష్కరించింది.
2007లో జరిగిన ఎన్నికల్లో అఖిలేశ్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 76వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2012 ఎన్నికల సమయంలో పీస్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. అప్పుడు కూడా అక్కడి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 2017 ఎన్నికలకు ముందు అఖిలేశ్ సింగ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన కుమార్తె అదితి సింగ్ తిరిగి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2021లో బిజెపిలో చేరారు. ఈ ఎన్నికల్లో బిజెపి తరపున అదితి పోటీలోకి దిగారు. మరో విషయం ఏంటంటే.. యుపిలో సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకూ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గం కూడా రాయ్ బరేలినే కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. తిరిగి అదే కుటుంబానికి చెందిన అదితికే విజయం అందిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీకా అనేది ఆసక్తిగా మారింది. అదితికి పోటీగా కాంగ్రెస్ పార్టీ.. మనీశ్ చౌహన్‌ను, సమాజ్‌వాదీ పార్టీ ఆర్‌పి యాదవ్‌ను నిలబెట్టింది. ఈ స్థానానికి నాలుగో విడతలో భాగంగా నేడు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.










