- కేంద్రం రూ.2,300 కోట్లు బిల్లుల బకాయి
- వచ్చే నెలలో ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శిస్తా
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : 'నిర్వాసితులకు ఏదో కట్టాం కదా... అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదు. అక్కడి ఇళ్లలో నిర్వాసితులు జీవితాంతం ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కచ్చితంగా పాటించాలి' అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి సోమవారం చేరుకున్న ఆయనకు మంత్రులు, ఉభయగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను, స్పిల్‌వే వద్దకు వెళ్లి ఆ పనుల తీరును సిఎం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. గత రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను అధికారులు సిఎంకు వివరించారు. అనంతరం కొండపై సమావేశ మందిరంలో అధికారులతో సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పునరావాస కాలనీల నిర్మాణంలో అలసత్వానికి తావులేకుండా చూడాలని, నాణ్యత కచ్చితంగా పాటించాలని, ఆర్ అండ్ ఆర్ పనుల నాణ్యత పరిశీలనకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఆ అధికారి ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తప్పకుండా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, తప్పులున్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అదనంగా కొంత డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినా నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలని, కాలనీల నిర్మాణానికి సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, నిర్వాసితులకు ఇబ్బందులు రాకుండా మంచి పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టడం లేదన్నారు. ఇకపైనా పెండింగులో పెట్టకుండా చూడాలని అధికారులను సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి దాదాపు రూ.2,300 కోట్లు బిల్లులు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నా, పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఇస్తోందని తెలిపారు. సుమారు ఆరు నెలలుగా బిల్లులు పెండింగులో ఉన్నాయని, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో వచ్చేలా దఅష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వచ్చే నెలలో ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శిస్తానన్నారు. నిర్వాసితులకు జీవనోపాధి, నైపుణ్యాభివఅద్ధిపై దఅష్టి పెట్టాలని సూచించారు. నిర్వాసితుల్లో ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలున్నవారికి తిరిగి భూములు ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే జూన్‌కల్లా లైనింగ్, రెండు కాల్వలకు లింకు పనులు పూర్తి చేయాలని ఆదేశం
వచ్చే ఏడాది జూన్‌కల్లా లైనింగ్‌తోపాటు రెండు కాల్వల లింకు పనులు, టన్నెల్ పనులు పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. దిగువ కాఫర్ డ్యాం పనులు, ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం (ఇసిఆర్‌ఎఫ్) పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌వే పనులు దాదాపు పూర్తి చేశామని, 48 గేట్లలో 42 గేట్ల అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని సిఎంకు అధికారులు తెలిపారు. జర్మనీ నుంచి సిలిండర్లు వచ్చాయని, ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న ఖాళీలను పూర్తి చేశామన్నారు. కాఫర్ డ్యాంలో ఖాళీల కారణంగా గతంలో వచ్చిన వరదలకు ఇఎస్‌ఆర్‌ఎఫ్ ప్రాంతం దెబ్బతిందని, ఈ పనులు ఎలా చేయాలనే దానిపై డిజైన్లు ఖరారవుతాయని అధికారులు బదులిచ్చారు. వచ్చే డిసెంబర్ కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎంకు వివరించారు.










