ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో నయా ఫాసిస్ట్‌వాది మారిన్ లీపెన్‌ను ఓడించి అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మాక్రాన్‌కు 58.5 శాతం ఓట్లు రాగా, లీపెన్‌కు 41.5శాతం ఓట్లు వచ్చాయి. మితవాద అభ్యర్ధి లీ పెన్ దేశంలోనే కీలకమైన పదవిని హస్తగతం చేసుకోకుండా నిలువరించబడినందుకు ఫ్రాన్స్, యూరప్ ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఇది, సుసంపన్నుడైన అధ్యక్షుడు, నయా ఫాసిస్ట్ మితవాద అభ్యర్థ్ధికి మధ్య జరిగిన పోటీ అన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. ఇటీవలి కాలంలోనే అత్యంత తక్కువగా ఓటింగ్ శాతం ఈ ఎన్నికల్లో నమోదైంది. 28శాతం మంది అర్హత గల ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. మరో 6.35శాతం మంది బ్లాంక్ బ్యాలెట్‌ను ఇచ్చారు. మరో 2.25శాతం మంది తమ బ్యాలెట్లను చించి వేశారు. మోడరేట్ మాక్రాన్‌కు, మితవాద, దుందుడుకు జాతీయవాది లీ పెన్‌కు మధ్య జరిగిన పోటీగా అంతర్జాతీయ ప్రధాన స్రవంతి మీడియా, గ్లోబల్ కార్పొరేట్ మీడియా వ్యాఖ్యానించాయి. కానీ, ఈనాడు ఫ్రాన్స్‌లో నెలకొన్న వాస్తవ రాజకీయ దృశ్యాన్ని ఈ మీడియా ఇవ్వలేదు. వాస్తవానికి మూడు ప్రధాన రాజకీయ శక్తుల మధ్య పోటీ నెలకొంది. మధ్యేమార్గవాదిగా చెప్పుకునే నయా ఉదారవాద మితవాద అభ్యర్థి మాక్రాన్, ఆయన పార్టీ ఎన్ మార్చె., మితవాద, నయా ఫాసిస్ట్ మారిన్ లీ పెన్, ఆమె పార్టీ నేషనల్ ర్యాలీ., జేన్ లుక్ మెలెంకన్, ఆయన ఉద్యమం 'లా ఫ్రాన్స్ ఇన్సోమైజ్' నేత్వృంలోని రాడికల్ లెఫ్ట్ మధ్య ప్రధానంగా పోటీ వుంది. అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌లో మాక్రాన్‌కు 27.85శాతం ఓట్లు లభించాయి. లీపెన్‌కు 23.15శాతం ఓట్లు రాగా, మెలెంకన్‌కు 21.95శాతం ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో లీ పెన్‌ను అధిగమించడంలో మెలెంకన్ కొద్దిలో విఫలమయ్యారు. అయితే 2017 నాటి అధ్యక్ష ఎన్నికల కన్నా తన పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు. ఆనాటి పోలింగ్‌లో ఆయనకు 19.6శాతం ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా ఐదేళ్ళ పదవీ కాలంలో మాక్రాన్ బహిరంగంగానే కార్పొరేట్ అనుకూల, సంపన్న అనుకూల విధానాలను అనుసరించారు. సంపన్నులకు పన్నుల్లో కోత విధించారు. కార్మిక లోకంపై భారాలు మోపారు. సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న కార్మిక హక్కులను కూడా లాగేసుకున్నారు. ఎల్లో వెస్ట్స్ మూవ్‌మెంట్‌పై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడ్డారు.
వామపక్ష వేదిక నుండి ఎన్నికల్లో పోరాడిన మెలెంకన్‌కు ఈసారి 77లక్షల ఓట్లు పోలయ్యాయి. కార్మిక వర్గం, యువత, జాతి, మతపరమైన మైనారిటీల నుండి మెలెంకన్‌కు గణనీయంగా మద్దతు లభించింది. ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ, ఇద్దరు ట్రాట్‌స్కీ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయకుండా వున్నట్లైతే (వారికి వరుసగా కేవలం 2.3శాతం, ఒక్కొక్క శాతం కన్నా తక్కువగా ఓట్లు లభించాయి) మెలెంకన్ చాలా సులభంగా లీపెన్‌ను అధిగమించి వుండేవారు. రెండో రౌండ్‌లో పోటీ పడేవారు. మొదటి రౌండ్ తర్వాత, లీ పెన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దని మెలెంకన్ పిలుపిచ్చారు. కానీ మాక్రాన్‌ను సమర్ధించడానికి తిరస్కరించారు. కార్మిక వ్యతిరేక వర్గ నయా ఉదారవాద అభ్యర్థికి, నయా ఫాసిస్ట్ అభ్యర్థ్ధికి మధ్య జరిగే పోటీలో ఇది సరైన వర్గ దృక్పథం. అందువల్ల, రనాఫ్ పోటీలోని సంకుచిత ఓటింగ్ ధోరణిని చూడడం ద్వారా మొత్తంగా రాజకీయ పరిస్థితిని కచ్చితంగా సమీక్షించలేం. ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించినప్పటికీ మాక్రాన్ విజయం సాధించారు. విప్లవ ప్రతీఘాత మితవాద అభ్యర్ధి అధికారంలోకి రాకూడదని మెజారిటీ వర్గ ప్రజలు భావించినందువల్లనే మాక్రాన్ గెలుపు సాధ్యమైంది. అదేసమయంలో, నయా ఫాసిస్ట్ శక్తుల నుండి వున్న ముప్పు కూడా వాస్తవమైనదే, ఎందుకంటే మితవాద వేదికపై నుండి పోటీ చేసిన లీ పెన్‌కు 41శాతానికి పైగా ఓట్లు పోలయిన విషయం మరిచిపోలేం. నయా ఉదారవాద ప్రభుత్వానికి, నయా ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో రాబోయే రోజుల్లో వామపక్షాలు చాలా కీలక పాత్ర పోషించాల్సి వుంది. లా ఫ్రాన్స్ ఇన్సోమైజ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి అన్ని వామపక్ష శక్తులను ఏక తాటిపైకి తీసుకొచ్చి, రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో విశ్వసనీయమైన పోరాటం జరపాల్సి వుంది.
(పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం)










