న్యూఢిల్లీ : ఓ పక్క రాజకీయ నేపథ్యం ఉన్న తల్లి.. మరోపక్క పారిశ్రామిక నేపథ్యం ఉన్న తండ్రి.. ఆలాంటి కుటుంబంలో పుట్టి 20 ఏళ్లకే ఔరా అనిపిస్తున్నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల తనయుడు రైహాన్ వాద్రా. ఫొటోగ్రఫీపై ఇష్టంతో పదేళ్ల వయసు నుంచే తల్లి సలహాలతో మెలకువలు నేర్చుకున్నాడు. విహారానికి వెళ్లిన సమయంలో అడవి అందాలను తన కెమరాలో బంధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడి జీవన విధానాన్ని తనదైన కోణంలో ఆవిష్కరించేవాడు. అలా తాను తీసిన ఫొటోలతో ఇప్పుడు తొలి ప్రదర్శన ఏర్పాటు చేశాడు. తాను తీసిన ఓ 40 ఫొటోలను 'డార్క్ పర్సెప్షన్ : యాన్ ఎక్స్‌పొజిషన్ ఆఫ్ స్పేస్, లైట్ అండ్ టైమ్' థీమ్‌తో ప్రదర్శనకు ఉంచాడు. ఈ నెల 17 వరకూ ఇది కొనసాగనుంది. ప్రజలతో అనుసంధానమవడానికి, జీవితంపై తన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి ఫొటోగ్రఫీని మాధ్యమంగా చేసుకున్నట్లు రైహాన్ తెలిపాడు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానో రానో చెప్పలేను కానీ ఫొటోగ్రఫీని మాత్రం కొనసాగిస్తానని చెప్పాడు. తన అభిరుచి కోసం రోజుకు నాలుగు గంటలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాడు. తనదైన దారిని ఎంచుకుని ముందుకు సాగుతున్న రైహాన్‌ను అభినందిస్తూ ప్రియాంక ట్వీట్ చేశారు.










