ప్రజాశక్తి రాయచోటి : ఓటు వేయడానికి ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి అని, పోలింగ్ స్టేషన్ లోపలికి ఎటువంటి ద్రవ పదార్థాలను అనుమతించరాదని కలెక్టర్ గిరీష పిఎస్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు. కోన శశిధర్‌తో కలిసి కలెక్టర్ గిరీష, ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొనే సూక్ష్మ పరిశీలకులకు బుధవారం స్థానిక స్పందన హాల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ అధికారులు, ఏజెంట్లు, ఎన్నికల సంఘం అధీకత వ్యక్తులు, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులు వంటి నిర్దిష్ట వ్యక్తులను మాత్రమే పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని చెప్పారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన అన్నారు. పోలింగ్ ప్రక్రియను వివరించారు. పోలింగ్ ప్రక్రియను ఉదయం 8 గంటలకు మాత్రమే ప్రారంభించాలని చెప్పారు. మీడియా ప్రతినిధులు ఎన్నికల సంఘం సూచనలను పాటించాలని ఆయన సూచించారు. ఓటర్ల వద్ద సెల్‌ఫోన్, లైటర్, పెన్ను తదితర వాటిని లేకుండా సూక్ష్మ పరిశీలకులు నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్‌గా నియమితులైన కోనశశిధర్, ఎన్నికల ప్రక్రియలో భాగమైనందుకు బాధ్యతగా, గర్వంగా భావించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఒక్కరోజు సరిపెట్టుకోవాలని, పోలింగ్ కేంద్రంలోని సౌకర్యాలపై ఫిర్యాదు చేయవద్దని ఆయన సూచించారు. నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాయచోటి రంగస్వామి, సత్యనారాయణ హాజరయ్యారు.










