నెహ్రూనగర్ (గుంటూరు) : సాధారణంగా ఓ ఫోన్ నెంబర్‌ను రెగ్యులర్‌గా వాడుతుండేవాళ్లు ఆ నంబర్ సడన్‌గా బ్లాక్ అయితే సహించలేరు. ఆ నంబర్ మళ్లీ కొత్త నంబర్‌గా మార్కెట్‌లోకెళితే, వేరొకరు వాడితే.. తిరిగి ఆ నంబర్ రానట్టే. ఇలాంటి ఘటనే ఓ యువకుడికి జరిగింది. తన ఫోన్ నంబర్‌ను తిరిగి ఇవ్వాలంటూ.. ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. ఎట్టకేలకు సిఐ బుజ్జగింపుతో యువకుడు సద్దుమణిగాడు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
స్థానిక, పోలీసు వివరాల మేరకు... బఅందావన్‌గార్డెన్స్‌కు చెందిన యువకుడు వాడుతున్న సిమ్‌కార్డు బిల్లు సరిగ్గా చెల్లించకపోవడంతో డీఫాల్ట్ అయ్యింది. ఆ యువకుడు తన నంబరు పనిచేయడం లేదని తెలుసుకునేలోపు.. ఆ ఫోన్ నంబర్ కొత్తగా నంబర్లు జారీ చేసే క్రమంలో జిల్లాపరిషత్ కార్యాలయానికి (జడ్పీ) కేటాయించబడింది. విషయం తెలిసిన ఆ యువకుడు మంగళవారం ఉదయం గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లాడు. నా ఫోన్ నంబర్‌ను మీరు వాడుతున్నారెందుకు ? అని అక్కడివారితో గొడవపడ్డాడు. అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులు కార్యాలయం కోసం కొత్తగా సిమ్‌కార్డు తీసుకున్నారని, అలా ఆ సెల్ కంపెనీ వాళ్లు ఇచ్చారని తెలిపారు. అయినా ఆ యువకుడు వినకుండా తన ఫోన్ నంబర్‌ను తనకు ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనతో డబ్బాలో తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకున్నాడు. ఊహించని ఈ పరిణామంతో నిర్ఘాంతపోయిన జడ్పీ సిబ్బంది నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ రత్నస్వామి తమ సిబ్బందితో జడ్పీ ఆఫీసుకు చేరుకొని ఆ యువకుడి చేతిలోని కిరోసిన్ డబ్బాను లాక్కొని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తన ఫోన్ నంబర్‌ను తిరిగి ఇప్పించాలంటూ ఆ యువకుడు పోలీసులపై ఒత్తిడి చేయడంతో తాను కంపెనీ వాళ్లకు చెప్పి మంచి ఫ్యాన్సీ నంబర్ ఇప్పిస్తానని సిఐ బుజ్జగించి ఆ యువకుడిని తిరిగి పంపారు.










