ఉమ్మడి జిల్లాలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం గుట్టుచప్పుడుగా సాగుతోంది. కేవలం వారం రోజుల వ్యవ óలో కడప జిల్లాలో బద్వేల్, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ప్రాంతాల్లో పెద్దఎత్తున పక్కదారి పట్టిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందట నుంచి గట్టిగా నిఘా ఉంచడంతో పిడిఎస్ బియ్యం పక్కదారి పట్టడానికి అవకాశం లేకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రప్రభుత్వ నిఘా సడలిపోతోంది. ఫలితంగా కడప, అన్నమయ్య జిల్లాల నుంచి పిడిఎస్ బియ్యం ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎగుమతి అవుతున్నాయి. జిల్లాల్లోని కొందరు డీలర్లు, ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్ల నుంచి మిల్లర్ల దగ్గరకు యథేచ్ఛగా వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, బద్వేల్, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లోని కొందరు డీలర్లు నేరుగా మిల్లర్లకు తరలించి నూకలుగా మార్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చౌకబియ్యం డీలర్లు తూకంలో తేడా చూపిస్తూ ఒక్కో వినియోగదారు నుంచి కనీసం కిలో చొప్పున తగ్గిస్తూ, ఆమేరకు డీలర్లు మిల్లర్ల చెంతకు చేర్చు తున్నారనే విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇటు వంటి దురాగతానికి బ్రేక్ పడాలంటే తూనికలు, కొలతలశాఖ అధికారులు దాడులు ముమ్మరం చేస్తేనే కొంత మేరకు వినియోగదారులకు ఊరట లభించే అవకాశం ఉంది. లేనిపక్షంలో అక్రమ రవాణా అంతు లేకుండా సాగుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. వారం రోజుల్లో కడప నగరంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా దారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బద్వేల్ పట్టణంలో చౌక బియ్యంతో కూడిన లారీని బద్వేల్ ఆర్డీఓ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడం సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో రూ.4.60 కోట్ల విలువైన చౌకబియ్యం పట్టుబడడం తెలిసిందే. అంతకు ముందు కడప నగరంలో పెద్దఎత్తున పోలీసులు బియ్యం అక్రమార్కులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 10 రోజుల వ్యవధిలోని కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా కావడం చర్చనీయాంశంగా మారింది. కడప, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో రెండు, మూడు ఘటనలు బయటపడితే, బయటపడకుండా ఇంకెన్ని లారీల చౌకబియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా అయ్యాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏడాది కిందటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిఘా విభాగాల పరిధిలో ఉన్న అక్రమార్కులు ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని విరుచుపడడం వెనుక మతలబేమిటో తెలియడం లేదు. పిడిఎస్ బియ్యం అక్రమార్కుల వెనుక ప్రజాప్రతినిధుల అండదండల హస్తం ఉందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వ పరిధిలోని నిఘా విభాగాలను మరింత పటిష్టం చేసి, పేదల బియ్యాన్ని అక్రమార్కుల బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. - ప్రజాశక్తి - కడపప్రతినిధి










