కడప ప్రతినిధి: ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది ఆగస్టు 26న విశాఖలో పర్యా వరణానికి నష్టమనే పేరుతో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న ఆందోళనల కారణంగా ఈ నెల 26 నుంచి ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఆదే శాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష కుటుం బాలు వీధిన పడుతున్నాయి. గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి ఫ్లెక్సీ ప్రింటింగ్‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఫ్లెక్సీప్రింటింగ్ యాజమాన్యాలు ఆందోళన చేయడంతో తాత్కాలికంగా వెనక్కితగ్గింది. ఈ ఏడాది జనవరి 26వ తేదీ నాటికి నిషేధం గడువును పొడిగించింది.
ఉమ్మడి జిల్లాలో 65 ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లు
ఉమ్మడి కడప జిల్లాలో 65పైగా ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లుఉన్నాయి. కడపలో 15, ప్రొద్దు టూరులో 10, రాజంపేటలో 9, రాయచోటిలో 6, బద్వేల్‌లో 8, రైల్వేకోడూరు, మైదుకూరు, పోరుమామిళ్ల, జమ్మలమడుగు పట్టణ ప్రాంతాల్లో నాలుగేసి చొప్పున కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రింటింగ్ మిషనరీ కింద 12 నుంచి 25 మంది చొప్పున సుమారు 50 వేల కుటుం బాలు ఉపాధి పొందుతున్నాయి. ఫ్లెక్సీల వాహనాల ద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు.
60 శాతానికి పడిపోయిన వ్యాపారం
ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 60 శాతం వ్యాపారం తగ్గిందని ఫ్లెక్సీప్రింటింగ్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అనంతరం రీసైక్లింగ్ చేసుకోవడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి నష్టమూ వాటిల్లదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సానుకూల ప్రత్యామ్నాయాన్ని చూపించ కుండా నిబంధనల కొరఢా ఝుళిపించడంపై యాజమాన్యాలు వాపోతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కాలుష్య నియంత్రణ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా పరిషత్ సిఇఒ, కలెక్టర్‌కు అప్పగించారు. ఈ నెల 26 తేదీ నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యావరణ చట్టం ప్రకారం ఫ్లెక్సీప్రింటింగ్ చదరపు అడుగుకు రూ.100 చొప్పున జరిమానా విధించనున్నారు. వీటికి పోలీస్, రెవెన్యూ ట్రాన్స్‌పోర్ట్, జిఎస్‌టి అధికారులు సహాయ పడతారని ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.
భారంగా క్లాత్‌బ్యానర్ ప్రింటింగ్
క్లాత్ బ్యానర్ ప్రింటింగ్ మిషన్లు ఖరీదు కావడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు రూ.60 లక్షల మేర వ్యయం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం గడిచిన మూడు నెలల వ్యవధిలో ఏఒక్కరికీ ఆధునిక మిషనరీలను అందజేయలేదు. ఆధునిక మిషనరీల కొనుగోలు చేయడానికి సాహసం చేయాల్సి వస్తోంది. ప్రస్తుత మిషనరీలనే క్లాత్‌బ్యానర్ ప్రింటింగ్‌కు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న ఆధునిక మిషనరీల కొనుగోలు కారణంగా అప్పుల్లో కూరుకునిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
నేటి నుంచి ప్రింటింగ్ నిలిపేస్తాం
ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మంగళవారం నుంచి 26వ తేదీ వరకు ప్రభుత్వానికి సంబ ంధించిన ఎటువంటి ఫ్లెక్సీలను ప్రిం టింగ్ చేయొద్దని నిర్ణయించాం. జిఒ నెంబర్ 65ను నిషేధించాలని కోరు తూ న్యాయస్థానాలను ఆశ్రయించాం. న్యాయస్థానాల నుంచి స్టే ఉత్వర్వులు వచ్చే అవకాశం ఉందనే ఆశాభావంతో ఉన్నాం. ప్రభుత్వం ఎటువంటి పర్యావరణ నష్టమూ వాటిల్లని నేపథ్యంలో నిషేధపు ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం.
కె.చెన్నకృష్ణారెడ్డి, ఫ్లెక్సీ ప్రింటింగ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్, కడప.










