Dec 28,2022 21:26

వృద్ధులు,


30 వేల మందికి నోటీసులు జారీతో విలవిల
తమ జీవనమెలా అంటూ ఆవేదన
పున:పరిశీలన జాబితాలో వేలాది మంది
తాఖీదులు వచ్చిన వారికి జనవరిలో కష్టమే
కన్నవారి ఆదరణ కరువై, కట్టుకున్న వారి తోడుకు దూరమై ఫించన్‌ మీదే ఆధారపడి బతుకుతున్న వారు ఎందరో అలాంటి వృద్ధులు, వితంతువులు, విభిన్నప్రతిభావంతుల పింఛన్లను తొలగిస్తూ వారి గుండెకోతకు కారణమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన వైసిపి ప్రభుత్వం లేనిపోనిసాకులతో పింఛన్లు తీసివేయడంపై నిరుపేదలు లబోదిబోమంటున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో 2,43,315 మంది, అన్నమయ్య జిల్లాలో 2,15,552 మంది వైఎస్‌ఆర్‌ పింఛను తీసుకుంటున్నారు. ఉభయ జిల్లాల్లో వేలాది మందికి అనర్హత పేరిట నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 30 వేల మందికి సచివాలయాల వారీగా అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా ఆధారాలు నిరూపించుకోకపోతే జనవరి నెల నుంచి వారికి పింఛను అందదు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు విలవిల్లాడిపోతున్నారు.
- ప్రజాశక్తి - యంత్రాంగం
పింఛన్‌ తొలగించడం అన్యాయం
ఆకస్మికంగా పింఛను తొలగించడం అన్యాయం. 11 ఏళ్ల నుంచి వికలాంగుల పింఛను వస్తోంది. రూ.3 వేలు ఇస్తుడడంతో సంతోషంగా ఉండేది. రెండు రోజుల క్రితం వాలంటీర్‌ వచ్చి పింఛను రద్దయిందని చెప్పారు. నా సోదరుని రేషన్‌కార్డులో నా పేరు ఉంది. అన్నకు కారు ఉందనే కారణంతో నాకు వస్తున్న పింఛను రద్దు చేశారు. పింఛను లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. సచివాలయం వద్దకు వెళ్లితే రేషన్‌ కార్డులో పేరు మార్చుకోవాలని చెప్పారు. ఏమీ చేయాలో అర్థం కావడం లేదు.
- ఎం.రవికుమార్‌రెడ్డి, విభిన్నప్రతిభావంతుడు, వేంపల్లె.
బిల్లు అధికంగా వచ్చిందని...
విద్యుత్‌ బిల్లు మూడు వందల యూనిట్లకుపైగా వస్తోందని పింఛను రద్దు చేస్తున్నట్లు వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. వయసు మీద పడి ఒక కాలు పూర్తిగా లేకపోవడంతో ఎలాంటి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి వస్తున్న పెన్షన్‌ సహాయం కూడా అందకపోతే జీవనాధారం కష్టతరమవుతుంది. పది సంవత్సరాల క్రితం నాతో వేరుపడిన కుమారుడిపై ఉన్న ఇంటిపై వస్తున్న కరెంటు బిల్లును నా పేరును చూపిస్తున్నారు. అధికారులు స్పందించి పెన్షన్‌ తొలగించకుండా చూడాలి.
- మల్కిగారి ఇబ్రహీం, చాపాడు.
అధిక ఇంటి స్థలం ఉన్నట్లు నోటీసు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగులకుపైగా ఇంటి స్థలం ఉందని పెన్షన్‌ తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. మునిసిపాలిటీ పరిధిలోని పాతపాలెం గ్రామంలో నివాసం ఉన్న ఇంటితో పాటు పశువుల పాకకు సంబంధించిన స్థలం ఉంది. పెన్షన్‌ తొలగింపు నిర్ణయం సరికాదు. నివాసం ఉన్న ప్రదేశాన్ని కొలతలు వేసి పెన్షన్‌ తొలగించకుండా చూడాలి.
- జి.ఓబులరెడ్డి, మైదుకూరు.
పింఛను కొనసాగించాలి
తన భర్త చనిపోవడంతో ఆరేళ్లుగా తనకు వితంతు పింఛను వస్తోంది. తన పేరుతో ఇళ్లు ఉందని నోటీస్‌ ఇచ్చారు. తనకు ఇప్పుడు పెన్షన్‌ తొలిగిస్తే నేను ఎలా జీవించాలి. తన వయసు 65 సంవత్సరాలు. తనకు జీవనాధార లేదు అధికారులు స్పందించి తనకు వస్తున్న పెన్షన్‌ కొనసాగించాలి.
- సి.హుసేన్‌బీ, కొత్తపేట, రాయచోటి.
15 ఏళ్లుగా పింఛను వస్తోంది
తనకు 15 ఏళ్లుగా వికలాంగుల పెన్షన్‌ వస్తోంది. సదరంలో డాక్టర్లు, ముగ్గురు కమిటీ నెంబర్లు ఆధ్వర్యంలో వికలాంగులని నిర్ధారణ చేసి తనకు పింఛను మంజూరు చేశారు. తన ఆధార్‌ నెంబర్‌కు రాయచోటి పట్టణానికి చెందిన తిరుపతి చిన్న రెడ్డప్పకు చెందిన ఆస్తులను జమ చేశారనే సాకుతో సచివాలయ అధికారులు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్‌ అధికారులను కలవగా స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ను కలవమని చెబుతున్నారు. తాను తిరుపతి చిన్న రెడ్డప్ప కోసం పట్టణమంతా వెదుకుతున్నాను. ఇంత వరకు ఆయన ఆచూకీ కనిపించడం లేదు. అధికారులు స్పందించి తనకు పింఛనును కొనసాగించాలి.
- బుక్కే శివకుమార్‌, విభిన్నప్రతిభావంతుడు, రాయచోటి.
ఇంటి స్థలముందని తొలగించారు
గతంలో తన కుమారుడికి ప్రభుత్వం డికెటి ఇంటి పట్టా ఇచ్చింది. దానిని పూట గడవక అమ్ముకున్నాం. తాముండే ఇళ్లు కూడా డికెటి స్థలం. పింఛను ఎందుకు రద్దు చేశారని అడిగితే ఇంటి స్థలం ఎక్కువ ఉందని పోయిందంటున్నారు.500 అడుగుల స్థలం మాత్రమే ఉంది. తాము అమ్ముకున్న స్థలంను తీసివేయమని అధికారులను అడుగుతుంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు.
- రహిమాన్‌ మహబూబి, వృద్ధురాలు, జమ్మలమడుగు.
పింఛను ఇప్పించండి
గతంలో ఎప్పుడు లేని విధంగా ఆధార్‌కు ఫోన్‌ నెంబరు లింక్‌ లేదని పింఛను ఇవ్వడం లేదు. అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్‌ రాకపోవడంతో జీవనం దుర్భరంగా మారింది. పెన్షన్‌కు దరఖాస్తు చేసుకొన్నా ఇంకా పెన్షన్‌ రాలేదు. అధికారులు చొరవ చూపి పెన్షన్‌ ఇప్పించాలి.
- సయ్యద్‌బాషా, కలికిరి.
మూన్నెళ్లుగా పింఛను ఇవ్వలేదు
పింఛనుకు దరఖాస్తు చేసి మూడు నెలలు కావస్తున్నా ఇంకా రాలేదు. జీవితం దుర్భరంగా మారి బిక్షాటన చేస్తున్నా. అధికారులు త్వరతిగతిన పెన్షన్‌ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను.
- నరసమ్మ, సిటిఎం, మదనపల్లి.
భూమి ఉందని నోటీసు ఇచ్చారు
పింఛను నిలుపుదలపై నాకు నోటీసు అందజేశారు. నాకు 1.44 ఎకరాలుంది. నా పేరుపై వెబ్‌ ల్యాండ్‌లో మూడు ఎకరాల మాగాని, 20 ఎకరాల మెట్ట పొలం ఉందని కారణంతో పెన్షన్‌ తొలగింపుపై నోటీసు అందజేశారు. నాకు అంత పొలం లేదు. తహసిల్దార్‌ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాన్ని కూడా అందజేశాను. నాకు పెన్షన్‌ పునరుద్ధరించాలని కోరుకుంటున్నా.
- సవరం పాపులమ్మ, పోరుమామిళ్ల.
పింఛను పునరుద్ధరించాలి
నాకు ఎలాంటి ఆస్థి లేదు. అధిక కరెంటు బిల్లు కూడా రాలేదు. అయినా నా పింఛను తొలగించారు. ప్రభుత్వం అందించే సామాజిక పించను పైనే జీవనం కొనసాగిస్తున్నాను. దయచేసి తొలగించిన పింఛను పునరుద్ధరించాలి.
- బి.సునీల్‌ కుమార్‌, విభిన్న ప్రతిభావంతుడు, రాజంపేట.