ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: వైద్య రంగంలో ఫిజియోథెరపీ ప్రాధాన్యత పెరిగి, కీలకంగా మారిందని, నగరానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యులు కిరణ్‌బాషా అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కలరోడ్డులోని విజయవాడ సూపర్ స్పెషాలిటీ ఫిజియోథెరపీ సెంటర్‌లో గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కొండపల్లికి చెందిన యువకుడు కొబ్బరిచెట్టుపై నుండి పడి వెన్నుపూస దెబ్బతినగా శస్త్ర చికిత్స అనంతరం నడవలేక మంచంలోనే ఉంటూ ఫిజియోథెరపీ కోసం రాగా ఆరు వారాల్లో నడిపించిన వైనంపై రోగి తనమాటల్లోనే వివరించాడు. ఇలా ఫిజియోథెరపీలో సాధించిన విజయాలపై సదస్సులో రోగులతోనే చెప్పించారు. ఈ సందర్భంగా కిరణ్‌బాషా మాట్లాడుతూ వెన్నునొప్పి, మోకీళ్లు సమస్యలు లిగమెంట్ సమస్యలతో పాటు శస్త్ర చికిత్సల అనంతరం కండరాలు సాధారణ స్థితికి తీసుకురావడంలో ఫిజియోథెరపీ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తాము అనేక క్లిష్టతరమైన సమస్యలతో వచ్చిన వారికి రెండు నుండి ఆరు వారాల్లో రిలీవ్ కలిగిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం నడిచేలా చేయడం ఫిజియోథెరపీ గొప్పతనమన్నారు. మందులు లేకుండా కేవలం వ్యాయామాలతో చేసే వైద్యమే ఫిజియోథెరపీ అన్నారు.










