Jan 28,2023 20:12

మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఫిబ్రవరి నుంచి 'ఆరోగ్యరక్ష'
నెల్లూరు :రూరల్‌ నియోజకవర్గ ప్రజలందరి ఆరోగ్యం కోసం ఫిబ్రవరి మాసం నుంచి 'ఆరోగ్య రక్ష' పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని రూరల్‌ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కషి చేస్తూన్నాని, అందులో భాగంగా తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు 'ఆరోగ్య రక్ష ' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇకపై నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతంలో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి ఆవసరమైన వారికి ఉచితంగా వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించాలని ఆలోచన చేశామన్నారు.
ఇప్పటి వరకు రూరల్‌ నియోజకవర్గం అభివృద్దికి తాను నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేశారు. ముఖ్యంగా గడప గడపకి కార్యక్రమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది తానేనని, రాజకీయ కార్యకర్త తెల్ల చొక్కా వెనుక కన్నీటి కష్టం ఉంటుందన్నారు. అటువంటి వారి సమస్యల పరిష్కారం కోసం నేను నా కార్యకర్త కార్యక్రమం చేపట్టి కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచానన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణకు శ్రీకారం చుట్టామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం అన్నీ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ శిభిరాల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరం అయిన వారికి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. గుండె, కంటి, గర్భసంచి మొదలైన ఆపరేషన్లను ఉచితంగా చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఇప్పటికే 6 కార్పొరేట్‌ హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించానని, 33 మంది నిపుణులైన వైద్యులు ముందుకొచ్చి సహకరించేందుకు అంగీకరించారన్నారు. రెండు స్వచ్ఛంధ సంస్థలు, కొంత మంది స్నేహితులు కూడా సహకరించేందుకు ముందుకొచ్చారని వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, పార్టీ జెండా, ఎజెండాలు కేవలం ఎన్నికలప్పుడేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ప్రతీ పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన అభిమతమని వెల్లడించారు.