రాయచోటి టౌన్ : విఆర్‌ఎలకు ఫేస్ యాప్‌ను అమలు చేయవద్దని, వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.చంద్రశేఖర్, ఎ.రామాంజులు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎపి రెవెన్యూ సహాయకుల సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ ఎస్.అల్లా బకాష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి విఆర్‌ఎలకు ఇచ్చిన వాగ్దానాలు మరచి పోవడం చాలా దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఆర్‌ఎలు రెవెన్యూ శాఖకు చాలా కీలకమని పొగిడిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే విఆర్‌ఎల చేసిన సేవలు మరచిపోయారా అని ప్రశ్నించారు. విజయవాడలో తాము చేసి ఆందోళన పాల్గొని మద్దతి ఇచ్చి తమ ప్రభుత్వం వస్తానే కనీస వేతన రూ.18 వేలు ఇస్తానని చెప్పి మూడున్నర సంవత్సరం జరుగుతున్నా మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సిఐటియు పోరాటం చేసి సాధించుకున్న డిఎను ఒక్కొక్క విఆర్‌ఎ దగ్గర నుండి రూ.11 వేలు వసూలు చేయడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి డిఎ రూ.300తో కూడిన వేతనం ఇవ్వాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చాలని తెలిపారు. రూ.10,500 లతో కుటుంబం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని లేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. విఆర్‌ఎలు ఐక్యతద్వారా మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పేరు చెబుతూ, గౌరవ వేతనంతో పనిచేసే, వీఆర్‌ఎలకు, సంక్షేమ పథకాలు వర్తించడం లేదని తెలిపారు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, నామినేళ్లను విఆర్‌ఎలుగా గుర్తించాలన్నారు. అటెండర్, వాచ్‌మెన్, డ్రైవర్ ఇలాంటి కాళీ పోస్టులను విఆర్‌ఎల ద్వారా భర్తీ చేయాలన్నారు. జిల్లా కన్వీనర్ అల్లాబకాస్ మాట్లాడుతూ విఆర్‌ఎలకు ఫేస్ యాప్ పెట్టడం ద్వారా, ఉన్న ఉద్యోగానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ఇంటి స్థలం, భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర గ్రామ సేవకుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆఫీసులో డిఆర్‌ఒ సత్యనారాయణకు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం జిల్లా కో-కన్వీనర్ భోగేశ్వరయ్య, రాజంపేట డివిజన్ అధ్యక్షులు కొరముట్ల సుధాకర్, రైల్వేకోడూరు అధ్యక్షులు, రేవతి, లక్ష్మీకర్, రాయచోటి నరసింహులు రెడ్డిశేఖర్, నాగేంద్ర, సంబేపల్లి రెడ్డెన్న , రెడ్డిభాష, రామేశ్వరి కుమార్, సుబ్రహ్మణ్యం, రాజంపేట నాయకులు నర్సింలు, ఓబులవారిపల్లి, ప్రసాద్, పుల్లంపేట వెంకటసుబ్బయ్య, చిట్వేలు సుబ్బరాయుడు, నందలూరు నర్శింహులు, ఈశ్వరమ్మ, పీలేరు ఆంజనేయులు, పెదమండ్యం బుడాన్ భాష, రెడ్డి రాణి, చలపతి, గుర్రంకొండ బాలాజి, నిమ్మనపల్లి ఓబయ్య, రవీంద్ర, కురబలకోట రామచంద్ర నాయుడు, తంబల్లపల్లి నగేష్ శివకుమార్, విఆర్‌ఎలు పాల్గొన్నారు.










