Jan 25,2023 19:42

- ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

రాజంపేట అర్బన్‌ : అంగన్వాడీలకు ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఆయాలతో భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఐదేళ్ల టిఎ, డిఎ మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కార్యకర్తలకు రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షలు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలలో రాజకీయ జోక్యం తగ్గించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.వేయి అదనంగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచిపోయినా కార్యకర్తలకు రూ.11,500లకే వేతనాన్ని పరిమితి చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు రూ.13,600లు వేతనం అందిస్తోందని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం గత వేతనాన్నే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పెనగలూరు మండల కార్యదర్శి మద్దెల ప్రసాద్‌, అంగన్వాడీ కార్యకర్తలు ఎం.ఈశ్వరమ్మ, పి.వి.శివరంజని, ఎస్‌.అమరావతి, ఎం.విజయమ్మ, షకీలా భాను, చెంచులక్ష్మి, శిరీష, అన్నపూర్ణమ్మ, వనిత, సునీత, రేవతి పాల్గొన్నారు.