ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : ముఖ ఆధారిత హాజరు నుంచి విఆర్‌ఎలను మినహాయించాలని, యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.చంద్రశేఖర్, ఎ.రామంజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో వారు మాట్లాడుతూ విఆర్‌ఎలలో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవని, వారిలో చాలా మంది నిరక్ష్యరాస్యులు కావడం చేత యాప్ వినియోగం తెలియదని పేర్కొన్నారు. కొందరు గ్రామీణ ప్రాంతాల వారికి నెట్ వర్క్ సమస్య కూడా ఉందని తెలిపారు. విఆర్‌ఎలకు రోజువారి పనికి సంబంధించిన హాజరు విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు విఆర్‌ఎ జీతాలతో పాటు ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రమాదం దాగిఉందని ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విఆర్‌ఎలకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, డిఎతో కలిపి వేతనం చెల్లించాలని, నామినీలను విఆర్‌ఎలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలని, 65 ఏళ్లు దాటి చనిపోయిన విఆర్‌ఎ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్స్‌తో ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పధకాలన్ని విఆర్‌ఎలకు వర్తింపచేయాలన్నారు. ధర్నా కార్యక్రమంలో గ్రామ సేవకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.










