ఫైనాన్స్ కంపెనీ అడ్వకేట్‌ను అడ్డుకున్న రైతులు
బకాయిలు తక్షణం చెల్లించాలి
ప్రజాశక్తి - పిచ్చాటూరు
నేతమ్స్ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన రూ.36 కోట్లను తక్షణమే వేలం వేసి చెల్లించాలని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్ డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని నేతమ్స్ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను నాలుగేళ్లుగా చెల్లించకుండా, ఫ్యాక్టరీని వేలం వేయకుండా ఫైనాన్స్ కంపెనీ ద్వారా కోర్టుకెళ్లి స్టే తెచ్చి స్వాధీనం చేసుకోవాలని చేసిన ప్రయత్నాన్ని చెరకు రైతులు అడ్డుకున్నారు. 'గో బ్యాక్ అడ్వకేట్ కమిషన్, రైతుల బకాయిలు తక్షణం చెల్లించాలి' అంటూ నినాదాలు చేశారు. దాసరి జనార్ధన్ మాట్లాడుతూ రైతుల బకాయిలు చెల్లించకుండా, సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం జల్సా చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెరకు రైతుల బకాయిల పట్ల చిత్తశుద్ధి ఉంటే బకాయిలను తక్షణం ఫ్యాక్టరీ వేలం వేసి చెల్లించాలన్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు రైతుల బకాయిల గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రైతుల బకాయిలు చెల్లించేంత వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో చెరకు రైతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణరెడ్డి,ఆవుల శ్రీనివాస్ యాదవ్, రైతులు రఘునాథరెడ్డి, సుదర్శననాయుడు, రాజగోపాల్ పాల్గొన్నారు. సిఐ వాసంతి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఫైనాన్స్ కంపెనీ కమిషన్ న్యాయవాది చేసేది లేక వెనుదిరిగారు.










