ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ : రాష్ట్రమంత్రులు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ తమ యోగ్యత మరిచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, వలసలపై సిఎం జగన్ చేస్తున్న మోసాన్ని యువశక్తి మీటింగ్‌లో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ లేవనెత్తితే మంత్రులు మితిమీరి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ముఖ్యంగా రోజా సంస్కారం లేని మాటలు మాట్లాడుతోందన్నారు. ఇదే రోజా టిడిపిలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎలా తిట్టిందో గుర్తించుకోవాలని సూచించారు. ఇప్పుడు వైసిపిలో ఉంటూ జబర్ధస్త్ వేషాలు వేస్తోందని ఎద్దేవా చేశారు. అలీఆగే అంబటి రాంబాబు.. జనసేన శ్రేణులతో పెట్టుకుంటున్నావ్.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అనంతపురం జిల్లాకు ఎప్పుడో ఒకసారి వస్తావు కదా.. అప్పుడు నీ భరతం పడతారన్నారు. ఇప్పటికైనా వైసిపి నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.










