పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఈయనకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ బసంత్ కుమార్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, కేంద్ర నెహ్రూ యువకేంద్రం (ఎన్‌వైకెఎస్) వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ చేతన్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు చలం, పుడా ఛైర్మన్ లక్ష్మీనరసమ్మ, ఇన్‌ఛార్జి డిఆర్‌ఓ భాగ్యలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి చేయూతను ఇస్తుందన్నారు. పుట్టపర్తి ప్రాంత ప్రజలకు బాబా జీవిత విశేషాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన లైట్ అండ్ లేజర్ షోను బాబా భక్తులకు అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు.










