సేట్ కుమారుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని, భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నౌకర్లు. వచ్చే అతిథులకు రకరకాలుగా వంటలు సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా వంట మనుషులను పిలిపించాడు సేట్. పుట్టినరోజు వారం రోజుల్లోనే ఉంది. ఇప్పటికే బంధుమిత్రులతో ఆ ఇల్లు కళ కళలాడుతోంది. పుట్టినరోజు దగ్గరకు వచ్చేకొద్దీ సేట్ కుమారుడు రంజిత్ ఏదో అసహనంతో ఉన్నాడు. ఎప్పుడూ నెలరోజుల ముందు నుంచే పుట్టినరోజు కోసం హడావిడి చేసే రంజిత్ ఈసారి ముభావంగా ఉండటం తల్లి రత్నభాయి గమనించింది. 'బాబు రంజిత్! నీ పుట్టినరోజు ఇక రెండు రోజుల్లోనే ఉంది కదా! నువ్వు ఇంకా షాపింగ్ చేయలేదు. కొత్త బట్టలు తీసుకోవా ఏమిటీ? ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? మాకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడివి నీవే నాన్న ఎందుకు అలా దిగులుగా ఉంటున్నావు?' అంటూ అడిగింది.
'ఈసారి పుట్టినరోజు ఆడంబరంగా జరుపుకోవడం నాకు ఇష్టం లేదమ్మాష' అన్నాడు రంజిత్. 'ఏమైంది నాన్నా!' అంటూ ఆందోళనగా అడిగింది తల్లి. 'ఈ కరోనా సమయంలో ఎందరో పస్తులుంటున్నారు. మరెందరో ఉపాధి కోల్పోయారు. చాలామంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజూ టీవీలో న్యూస్ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఈసారి పేదల ముందు పుట్టినరోజు జరుపుకుని, వారి కడుపు నింపాలి అని ఉంది. ఇంకా వారికి దుస్తులు, తినడానికి తిండి ఇవ్వాలనేది నా కోరిక. వారి మధ్యనే కేక్ కట్ చేసి, పేద ప్రజల అవసరాలు తీర్చాలి. అప్పుడే వారు ఆనందంగా ఉంటారు. వారి కళ్లలో సంతోషం చూడాలని ఉంది. నా పుట్టినరోజు వారి మధ్య జరుపుకోవడమే మీరు నాకు ఇచ్చే దీవెన' అని అన్నాడు రంజిత్. కొడుకు మాటలు దగ్గరలోనే ఉన్న సేట్‌కు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే సేట్ చప్పట్లు కొడుతూ 'గుడ్ రంజిత్, సరిగ్గా ఇదే ఆశయం మీ తాతకు ఉండేది. నువ్వన్నట్లు నీ జన్మదినం కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన, పస్తులుంటున్న పేదల మధ్యలో జరిపే ఏర్పాట్లు చేస్తాను. నీ ఆనందమే మా ఆనందం!' అన్నాడు. అనుకున్నట్లుగానే రంజిత్ పుట్టినరోజు వేడుకలు పేదల మధ్య జరుగుతోంది. అందరికీ వస్త్రాలు, సరుకులు రంజిత్ చేతుల మీదుగా ఇస్తున్నారు. పేదలు ఒక్కొక్కరూ రంజిత్‌ను కృతజ్ఞతగా చూస్తూ ఆశీర్వదిస్తున్నారు.
అక్కడే భోజనాలు చేస్తున్న వారిలో ఓ ముదుసలి ఇలా అన్నాడు 'ఈ రోజు సేట్ కుమారుడు కరోనా సమయంలో మనకు కావాల్సిన అవసరాలు తీర్చాడు. ఆ బిడ్డ పెద్ద మనసును నేను అభినందిస్తున్నాను. రంజిత్ ఆనందించేలా అందరం చప్పట్లు కొడుతూ ''హ్యాపీ బర్త్ డే టు యూ'' అని పాట పాడదాం!' అన్నాడు. చప్పట్లతో, పేదల ఆలాపనతో ఆ ప్రాంగణం మారుమోగింది. కొడుకు మంచితనాన్ని చూసి ఆనందభాష్పాలు రాల్చాడు సేట్.
కనుమ ఎల్లారెడ్డి .. 9391523027