Nov 07,2023 22:46

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రస్తుతం విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వాటితో పోల్చుకుంటే ప్రస్తుతం అరకొర వేతనాలే అందుతున్నా కార్మికులు గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. దుమ్మూ దూళిలో పని చేస్తూ వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. పల్లెల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా పారిశుధ్య పనులు చేస్తున్నారు. ఎక్కడ చెత్త పోగుబడినా వెంటనే తీసి సంపద కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణలో పాల్గొంటున్న క్లాప్‌ మిత్రలకు సుమారు ఏడాదికాలంగా వేతనాలు అందడం లేదు. నెలకు కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నా అవీ ప్రతినెలా సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కాకినాడ జిల్లాలో 1,701 మంది క్లాప్‌ మిత్రలు పంచాయతీల్లో పారిశుధ్య పనుల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. 2021 అక్టోబర్‌ 2న రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి రోజున క్లిన్‌ ఎపి పేరుతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అమలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణను కొనసాగిస్తోంది. రిక్షాలు, ఆటోలు ద్వారా సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు క్లాప్‌ మిత్రలు తరలి స్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లలో పూడుకుపోయిన చెత్తను తొలగించి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా తీసుకునే చర్యల్లో భాగంగా పనిచేస్తున్నారు. తక్కువ వేతనమే అయినప్పటికీ ఎప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి పంచాయతీలో శాశ్వత ఉద్యోగులుగా నియామకాలు చేస్తుందనే ఆశతో పని చేస్తున్నారు. ఇచ్చేది అరకొర వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారిందని క్లాప్‌ మిత్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10 నెలలుగా పెండింగ్‌
ఒక్కొక్కరికీ రూ.6 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు. పలు పంచాయతీల్లో అవీ 10 నెలల కాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోయినా అవకాశం ఉన్న కొన్ని పంచాయతీలు జనరల్‌ నిధుల నుంచి తీసి జీతాలు ఇస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా వీరికి జీతాలు చెల్లిస్తామని మొదట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ అమలు చేయలేదు. ఆ తర్వాత పంచాయతీలపైనే భారం మోపింది. 10 నెలలుగా ఒక్కొక్కరికీ రూ.60 వేలు వేతనం పెండింగ్‌లో ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా రూ.10.20 కోట్లు వేతనాలు ఇంకా ఇవ్వలేదు. అధికారులు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకే పెండింగ్‌ ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం ఆర్భాటంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినా అందులో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ పోషణ కష్టంగా మారింది. నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, ఆయిల్‌, కూరగాయలు, గ్యాస్‌, ఉల్లిపాయలు ఇలా అన్ని ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనంటున్నాయి. రవాణా ఛార్జీల మోత మోగుతోంది. కరెంటు బిల్లులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు రూ.6 వేలు వేతనంతో ఎలా బతుకుతారనేది ప్రభుత్వమే చెప్పాలి. అవి కూడా కొన్ని నెలలుగా పెండింగ్‌ లోనే ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య పనుల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సకాలంలో జీతాలను విడుదల చేసి కనీస వేతనాలు అందివ్వాలని కోరుతున్నారు.