Feb 20,2022 07:56
  • ధాన్యం రైతు అప్పులపాలు
  • నెల రోజులు దాటినా బిల్లులు చెల్లించని ప్రభుత్వం

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రామకృష్ణాపురానికి చెందిన రైతు కరగాన కొండయ్య జనవరి ఆరో తేదీన అంధవరం ఆర్‌బికెకు 120 ధాన్యం బస్తాలు ఇచ్చారు. ఈయనకు ప్రభుత్వం నుంచి రూ.1,86,240 రావాల్సి ఉంది. ఇంత వరకూ డబ్బులు అందలేదు. రెండో పంట కింద ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు కోసం బ్యాంకులో రూ.50 వేలు రుణం, వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. బ్యాంకుకు రూ.583, వ్యాపారికి రూ.రెండు వేలు మొత్తం నెలకు రూ.2,583 వడ్డీ కట్టాల్సివస్తోంది.
    అంధవరం పంచాయతీకి చెందిన కౌలు రైతు గొర్లె శ్రీను గత నెల 11వ తేదీన రైతుభరోసా కేంద్రానికి 80 బస్తాలు ఇచ్చాడు. ఆయనకు రూ.1,24,160 చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రెండో పంట కోసం అప్పులు చేశాడు. కౌలు రైతుకు బ్యాంకు అప్పు ఇవ్వకపోవడంతో తన దగ్గరున్న మూడు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకున్నారు. ఇంటి అవసరాలు, ఇతర ఖర్చులకు వడ్డీ వ్యాపారుల నుంచి మరో రూ.30 వేలు నూటికి రూ.2 వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నాడు. నెలకు వడ్డీల రూపంలో బ్యాంకుకు రూ.608, వ్యాపారికి రూ.600 చెల్లిస్తున్నాడు.
     ఇదీ ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చిన రైతుల దయనీయ పరిస్థితి. ఖరీఫ్‌లో తీసుకున్న అప్పులు చెల్లించలేక కొందరు, రెండో పంట కోసం మదుపులు లేక మరికొందరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 2021-22 ఖరీఫ్‌లో 49.5 క్వింటాళ్ల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కొనుగోలు కోసం 8,783 రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 5,395 కేంద్రాల ద్వారా 34.19 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేసింది. 5,01,107 మంది రైతుల నుంచి 6,650 కోట్ల విలువ గల ధాన్యాన్ని సేకరించింది. ఇంకా 15.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ధాన్యం ఇచ్చిన రైతులకు 48 గంటల నుంచి 21 రోజుల వ్యవధిలో చెల్లింపులు చేపడతామని చెప్పిన ప్రభుత్వం, నెల రోజులు దాటినా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులు దాటిన బిల్లులు రూ.1500 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 21 రోజులకు పైగా దాటిన బిల్లులు రూ.153.16 కోట్లు ఉన్నాయి. వీటిలో నెల రోజులు దాటిన బిల్లులూ ఉన్నాయి.
 

                                                    బ్యాంకుల్లో బంగారం తాకట్టు

ధాన్యం డబ్బులు సకాలంలో రాకపోవడంతో రైతులు అప్పులు పాలవుతున్నారు. ఖరీఫ్‌లో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న రైతులు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి మొదటి వారంలోనే బ్యాంకుల్లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపిస్తారు. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా సాగుతోంది. రెండో పంట, ఇతర అవసరాల కోసం రైతులు మిగిలిన బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో తాకట్టు పెడుతూ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులను జారీ చేయకపోవడంతో, తెలిసిన రైతులతో తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నారు. డబ్బులు రాక, బ్యాంకులు రుణాలు ఇవ్వక అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.