పూర్తి సమాచారాన్ని అందించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగే సామాజిక తనిఖీ బృందానికి పూర్తి సమాచారం అందించి సహకరించాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2020 నుంచి 2022 మార్చి వరకు మొత్తం రూ.18 కోట్ల రెండు లక్షల పనులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కూలీలకు రూ.15కోట్ల 4.55లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.80 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో నేటి నుండి సామాజిక తనిఖీ బృందం ఉపాధి హామీలో జరిగిన పనులను తనిఖీ చేస్తామన్నారు. తనిఖీ బృందానికి ప్రజా ప్రతినిధులు, క్షేత్రస్థాయి ఉపాధి హామీ సిబ్బంది సహకరించి జరిగిన పనులకు సంబంధించిన రికార్డులను అందివ్వాలని సూచించారు. ఇంకా అటవీశాఖ పంచాయతీరాజ్ అధికారులు జరిగిన పనులకు సంబంధించిన రికార్డులను అందించాలన్నారు. తనిఖీ బృందం, క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో తనిఖీ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎపిఒ శ్రీనివాసులు, ఎస్‌ఆర్‌పి సుబ్బారావు, డిఆర్‌పిలు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.










