Dec 31,2022 20:19

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజా

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో శనివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనుజా అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో కౌన్సిలర్లు ఆమోదించడంతో ముగిసింది. కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన 10 అంశాలను చదివి వినిపించడంతో అందరూ ఆమోదించారు. అంతకు మునుపు పురపాలక వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మదనపల్లె పురపాలక వార్షిక బడ్జెట్‌ అంచనాలను తయారు చేశారు. 2029-24 సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనా బడ్జెట్‌ రూ.105.55 కోట్లుగా రూపొందించారు. రెవెన్యూ ఆదాయం కింద రూ.44.47 లక్షలు, మూలధనం కింద రూ.61.08 లక్షలు చూపించారు. ఇక నింబంధనల ప్రకారం తాగునీటి సరఫరా కోసం బడ్జెట్లో 25 శాతం, డ్రెయినేజీ నిర్వహణకు 15 శాతం, రోడ్ల నిర్వహణకు 20, వీధి దీపాల నిర్వహణకు 10 శాతం నిధులను బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. మూలధనం ఆదాయం గత ఏడాదితో పోల్చితే రూ.7.33 కోట్లు తగ్గింది. మొత్తం ఆదాయంలో రూ.96.47 కోట్లు ఖర్చు కింద చూపించి, అంతిమ నిల్వ కింద రూ.9.07 లక్షలు బడ్జెట్లో పొందుపర్చారు. పురపాలక సంఘానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కింద రూ.18.17 కోట్లు రాబడి ఉన్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. కార్మికుల జీతభత్యాలు రూ.10.94 కోట్లు, పరిపాలనపరమైన ఖర్చులు రూ.3.62 కోట్లు ప్రభుత్వ ప్లాను గ్రాంట్లు కింద రూ.61.08 కోట్లు రావచ్చని బడ్జెట్‌ లో పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింక వెంకటాచలపతి, కమిషనర్‌ ప్రమీల, కౌన్సిలర్లు పాల్గొన్నారు.