Dec 29,2022 21:35

పట్టుబడిన ప్లాస్టిక్‌ కవర్లను పరిశీలిస్తున్న మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, మున్సిపల్‌ అధికారులు

        హిందూపురం : ప్లాస్టిక్‌ వాడకంతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోందన్న ఉద్ధేశంతో సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇదే నేపథ్యంలో హిందూపురం పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మారుస్తామని నాయకులు అధికారులు జోరుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆచరణలో మాత్రం ఇది కన్పించడం లేదు. హిందూపురానికి ప్లాస్టిక్‌ కవర్లను హైదరాబాద్‌ నుంచి తెప్పించి విక్రయించే వ్యాపారుల ముఠా చేలరేగిపోతోంది. హిందూపురం పరిసర ప్రాంతాలకే కాదు కర్ణాటకకు సరఫరా చేస్తున్నారు. సచివాలయాల పర్యావరణ కార్యదర్శులు ఇటీవల ప్లాస్టిక్‌ నియంత్రణపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. బందాలుగా ఏర్పడి పట్టణంలోని దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. కిలో, అరకిలో పట్టుబడుతుండటం, వారంతా చిరు వ్యాపారులు కావడంతో ప్లాస్టిక్‌ను తెప్పించే బడా వ్యాపారులపై సిబ్బంది దష్టి సారించారు. పట్టణానికి ప్లాస్టిక్‌కు తెప్పించి నిల్వ ఉంచిన మూడు దుకాణాలను ఇటీవల గుర్తించి దాడులు చేశారు. ఒక్కో చోట ఏకంగా రెండు టన్నుల వరకు ప్లాస్టిక్‌ కవర్లు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. ఇక పట్టణానికి ప్లాస్టిక్‌ కవర్లు రావనుకున్నారు. అయితే అక్కడే అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. రెండు టన్నుల ప్లాస్టిక్‌ పట్టుబడినా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నామమాత్రంగా రూ.5 వేలు, రూ.10 వేలు జరిమానా విధించి వదిలేశారు. ఇటీవల పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో ఓ దుకాణంలో టన్నుకుపైగా ప్లాసిక్‌ పట్టుబడినా నామమాత్రపు జరిమానా వేశారు. పట్టణ నడిబొడ్డున ఓ లాడ్జిలో ఒక్కటిన్నర టన్ను కవర్లు పట్టుబడినా చర్యలు లేవు. దీంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక వాహనాల్లోనే కాకుండా ఏకంగా ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌ వాహనంలో టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ను తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రికిరాత్రే వాటిని రహస్య స్థావరాల్లోకి చేరుస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఓ ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌ కార్యాలయంకు లగేజీ వాహనం వచ్చింది. దీని నుంచి ప్లాస్టిక్‌ కవర్లు ఉన్న సంచులను దించుతుండగా ఓ సంచి పగిలిపోయింది. దీంతో కవర్లు బయటకు కనిపించాయి. ఇది గుర్తించిన ఓ పారిశుధ్య కార్మికుడు సచివాలయ పర్యావరణ కార్యదర్శికి సమాచారం ఇచ్చాడు. వెంటనే సచివాలయ అధికారులు ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసు కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా రెండు టన్నులకుపైగా కవర్లు పట్టుబడ్డాయి. అంతలోనే అధికార పార్టీ నాయకుడు ఒక్కరు ఫోన్‌ చేసి వాటిని వదిలేయాలని పర్యావరణ కార్యదర్శులకు సూచించారు. స్వాధీనం చేసుకున్న కవర్లను అప్పటికే కార్యాలయానికి తరలించామని ఇప్పుడు తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని సచివాలయ సిబ్బంది ఆ నాయకుడికి చెప్పారు. చివరకు మున్సిపల్‌ అధికారులు రెండు టన్నుల ప్లాస్టిక్‌ కవర్లు ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి పట్టుబడితే అవి ఎవరివో తెలియదని, కేవలం రూ.10 వేలు జరిమానా విధించి, చేతులు దులుపుకున్నారు. ఈ తతంగం వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ విక్రయాల ముఠాపై కేసులు పెట్టి రూ.లక్ష జరిమానా విధించడానికి అవకాశం ఉన్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోనట్లు తెలుస్తోంది. ఇలా నామమాత్రపు చర్యలతో పట్టణం ప్లాస్టిక్‌ రహితంగా ఎలా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.