Jan 13,2023 22:12

ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వైసిపి కౌన్సిలర్లు

          హిందూపురం : హిందూపురం అధికార పార్టీలో అసమ్మతి మరోసారి రచ్చకెక్కింది. ఈ సారి ఏకంగా ఆ పార్టీ కౌన్సిలర్లు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. ఓ ఇంటి నిర్మాణ విషయంలో అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఇద్దరు నేతలు తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ ఘటనలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసు స్టేషన్‌లోనూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
హిందూపురం పట్టణంలోని బుక్కడిపేట 5వ వార్డుకు చెందిన ఇర్షాద్‌ అహ్మద్‌ 29వ వార్డులో ఓ ఇంటిని నిర్మాణం చేస్తున్నారు. ఈయన మూడు అడుగుల రోడ్డును ఆక్రమించుకుని ఇల్లు నిర్మిస్తున్నారని అధికార పార్టీకి చెందిన 29వ వార్డు కౌన్సిలర్‌ రోషన్‌ అలీ మున్సిపల్‌ అధికారులు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ పరిశీలన చేసి నిజంగా ఆక్రమణ జరిగి ఉంటే తొలగించాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు పరిశీలన చేసి ఆక్రమణ జరిగిందని నిర్ధారణ చేశారు. ఈ మేరకు ఆక్రమణల తొలగింపునకు శుక్రవారం జెసిబిలను తీసుకుని తొలగించడానికి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, పోలీసుల సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న 5వ వార్డు కౌన్సిలర్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ అక్కడికి చేరుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్‌ రోషన్‌ అలీ రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తే లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వర్తింస్తుందని అధికారులను ప్రశ్నించారు. కాలనీల్లో అన్ని ఇళ్లు ఎక్కడి వరకు ఉన్నాయో ప్రస్తుతం నిర్మాణం అవుతున్నా ఇల్లు కూడా అక్కడే ఉందని పేర్కొన్నారు. ఇలా ఈ విషయంపై ఇద్దరు కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దూషణలు చేసుకున్నారు. ఇది కాస్త పెరిగి ఒకరిపై ఒకరు భౌతికంగా దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపైనే ఇద్దరు కొట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని ఇద్దరికీ సర్ధిచెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.
ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌ వదద ఆందోళన
ఇర్షాద్‌ అహ్మద్‌కు మద్దతుగా పదిమంది వైసిపి అసమ్మతి కౌన్సిలర్లు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ ఛాంబర్‌ వద్దకెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ కౌన్సిలర్‌ ఇల్లు నిర్మాణం చేసుకుంటుండగా, నిర్మాణాన్ని కూల్చడానికి జెసిబి పంపడం ఏమిటని ఛైర్‌పర్సన్‌ను నిలదీశారు. సమస్య ఉంటే ఇద్దరు కౌన్సిలర్లను పిలిపించి మాట్లాడాల్సింది పోయి ఇలా కక్షలు రేపే విధంగా ఇల్లు కూల్చడానికి జెసిబిలను పంపడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే క్రమంలో కౌన్సిలర్‌ శివ, ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్‌ శివ తనను ఏకవచనంతో మాట్లాడి అగౌరవపరిచారంటూ ఛైర్‌పర్సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఛైర్‌పర్సన్‌ భర్త హల్‌చల్‌
ఛైర్‌పర్సన్‌పై దూషణల విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త తన మద్దతుదారులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడున్న అసమ్మతి వర్గం కౌన్సిలర్లతో వాదనకు దిగారు. మహిళ అని చూడకుండా ఎలా అవమానకంగా మాట్లాడతారంటూ కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఛైర్‌పర్సన్‌ను దురుసుగా మాట్లాడే లేదని, ఇంటి నిర్మాణ విషయంపై మాత్రమే ప్రశ్నించామని అసమ్మతి కౌన్సిలర్లు సమాధానం ఇచ్చారు. అధికార పార్టీలో ఉంటూ బెదిరించాలని చూస్తే తమకు కౌన్సిలర్‌ పదవులే అవసరం లేదని అసమ్మతి కౌన్సిలర్లు పేర్కొన్నారు. వెంటనే పదవులకు రాజీనామా చేస్తామని 15 మంది కౌన్సిలరు ప్రకటించారు. ఈ వాదనల నడుమ ఛైర్‌పర్సన్‌ భర్త అక్కడినుంచి వెళ్లి పోయారు.
పోలీసు స్టేషన్‌కు పంచాయతీ
అధికార పార్టీ నేతల బాహాబాహి వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సిలర్‌ శివపై ఫిర్యాదు చేశారు. తన ఛాంబర్లోనే తనను ఇష్టారాజ్యంగా మాట్లాడటంతో పాటు దురుసుగా వ్యవహారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఛైర్‌పర్సన్‌ కేసు పెట్టారన్న విషయం తెలుసుకున్న అసమ్మతి వర్గం కౌన్సిలర్లు అంతా స్టేషన్‌కు చేరుకున్నారు. ఛైర్‌పర్సన్‌ భర్త అనుచరులతో మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి బెదిరింపులకు దిగారని, తమ వర్గీయుడు నవీన్‌ను దూషించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. కాగ ఈ వ్యవహారం వైసిపి పరిశీలకుడు రెడ్డి ఈశ్వరరెడ్డి నాయకులతో మాట్లాడినట్లు సమచారం. అధిష్టానం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.