హిందూపురం : పుట్టపర్తి జిల్లాలోనే హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డు పెద్దది. దీని పాలక వర్గం గడువు ముగిసి ఆరు నెలలు పూర్తి అయినా, ఇంత వరకు పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. గతేడాది ఛైర్మన్ పదవి ఓసీ పురుషులకు కేటాయించడంతో పోటాపోటీగా ముందుకు వచ్చారు. ఈ ఏడాది బిసి మహిళాకు రిజర్వు చేయడంతో ఎవరూ ముందుకు రావాడం లేదు. జనవరి నుంచి హిందూపురం మార్కెట్‌యార్డులో చింతపండు వ్యాపారాలు ప్రారంభం అవుతాయి. ఇక్కడ నుంచి చింత పండు దేశా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారాలు జరిగే మార్కెట్‌కు వెంటనే కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. పుట్టపర్తి జిల్లాకు సంబంధించి హిందూపురం-బిసి మహిళా, పెనుకొండ-బిసి జనరల్, గోరంట్ల-ఓసీ, ధర్మవరం ఎస్సీలకు కేటాయించారు. ఈ కమిటీలకు గడువు మగిసి ఆరు నెలలు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు పాలక వర్గాన్ని నియమించలేదు. తనకల్లు, మడకశిర, కదిరి కమిటీలను ఏర్పాటు చేశారు.
పురంలో కనిపించని వేడి...
రాష్ట్రంలోనే హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి చింతపండు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. అనంతపురం మార్కెట్ తరువాత అతి పెద్ద మార్కెట్ హిందూపురందే. గతంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ గిరి కోసం ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేసే వారు. అయితే హిందూపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గిరి బీసీ మహిళాకు రిజర్వేషన్ రావాడంతో ఆ వేడి కనిపించడం లేదు.
ఎస్సీలకు దక్కని చోటు
హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డు 1970వ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క సారి కూడా అవకాశం దక్క లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సామాజిక వర్గాల వారికి ఛైర్మన్ పదవిని కేటాయించారు. ఇందులో ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారు. ఒక్క సారి ముస్లిం మైనార్టీ వర్గానికి కేటాయించారు. ఈ సారి మార్కెట్ ఛైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ సామాజిక వర్గం వారు కోరుతున్నారు.
కమిటీ ఇలా ...
కమిటీకి గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉంటారు. కమిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 13 మంది సభ్యులు ఉంటారు. ముగ్గురు ట్రేడర్స్ ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ, హార్టికల్చర్ ఏడీలు, మున్సిపల్ కమిషనర్, మండలానికి సంబంధించి ఓ సహకార సంఘం అధ్యక్షులతో మొత్తం 20 మంది ఉంటారు. మార్కెట్ కమిటీ సభ్యులు కాలపరిమితి ఏడాది మాత్రమే ఉంటుంది. ఆపై రోటేషన్ ప్రాతిపదికన ఈ ప్రక్రియ కొనసాగనుంది.










