Dec 05,2022 21:28

పారిశ్రామిక వాడ వద్ద రసాయన వ్యర్థాలు

         హిందూపురం : బంగారాన్ని పండించే పంట పొలాలను అభివృద్ధి పేరుతో పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వాలు సేకరించాయి. రాజకీయ అండదండలున్న బడాపారిశ్రామిక వేత్తలకు వీటిని అప్పగించారు. ఇలా హిందూపురం రూరల్‌ మండల పరిధిలోని తూమకుంట, గోళ్లపురం పారిశ్రామిక వాడలో పలు రసాయన పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. ఈ రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థలతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఉన్న కొద్దిపాటి పంట పొలాలు కూడా నిర్జీవం అవుతున్నాయి. పరిశ్రమ యాజమాన్యం యథేచ్ఛగా వ్యర్థాలను మురుగుకాలువల్లో పడేస్తోంది. దీనిని నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నారు.
         హిందూపురం తూముకుంట, గోళ్లపురం పారిశ్రామిక వాడతోపాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలుష్యపు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు కాలుష్యం దెబ్బతో శ్వాసకోస, చర్మవ్యాధుల రోగాలబారిన పడుతున్నారు. కెమికల్‌, స్టీల్‌ పరిశ్రమలు వెదజల్లే పొగ, దుర్వాసనకు పారిశ్రామికవాడ పరిధిలోని గోళ్లాపురం, గుడ్డంపల్లి, దేవరపల్లి, తదితర గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే పొగలు మేఘాలను తలపిస్తుంటాయి. దట్టమైన పొగలతో కనీసం వాహనాలు నడుపడానికి సైతం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పారిశ్రామిక వాడలో మనస్వీ. వరహాయి తదితర రసయాన పరిశ్రమలున్నాయి. ఇలాంటి పరిశ్రమలు వ్యర్థాలను సమీప భూముల్లోకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు. దీంతో భూ గర్భజలాలు సైతం కలుషితమవుతున్నాయి. రసాయనాల మోతాదు పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక రైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భూమిలో సారం తగ్గిపోయి పంటలు పండడం లేదు. ఈ ప్రాంతంలో మొక్కజొన్న తప్పా మరే ఇతర పంట సాగు చేసుకోలేని పరిస్థితికి వచ్చేసింది. ఇటీవల ఇందులో సైతం దిగుబడి తక్కువగా వస్తోంది. పురం ప్రాంతానికి అతిపెద్ద ఆధారంగా నిలిచిన పట్టుపరిశ్రమ కాలుష్యం దెబ్బతో చితికిపోయింది. స్ధానికులకు ఇటు పరిశ్రమల్లో ఉపాధి లభించక అటు తమకు ఉన్న భూముల్లో పంటలు వేసుకోలేక రెండు విధాలుగానూ నష్టపోయారు. రసయాన వ్యర్థలను పట్టణంలోని కొటపి రోడ్డు రైల్వే ట్రాక్‌ పక్కన వేయడంతో అక్కడ ఉన్న చెట్లు ఎండిపోయాయి. ఆ దారి వెంటే వెళ్తే భరించలేని దుర్వాసన వస్తోంది.
భూమిపైనే రసాయన వ్యర్థాలు
           తూముకుంట,గోళ్లపురం పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన ఉక్కు, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే విషవాయును పీల్చడం ఒక కష్టం అయితే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థలను చుట్టు పక్కల పారివేస్తుండడం అదనపు కష్టంగా మారింది. సాధారణంగా వ్యర్థాలను సుమారు 50 అడుగుల భూమిలోపల వేసి పూడ్చాలి. అయితే ప్రజాత్రినిదులే ఏజెంట్లుగా మారి పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాన్ని ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు చేసి జన నివాసం లేరన్న సాకుతో పాలాల మధ్య వేస్తున్నారు. ఈ రసాయనాలు పడిచన చోట కనీసం ఒక పిచ్చి మొక్క కూడా మొలవదు. ఇది చాలదన్నట్లు ఇటీవల కురిసిన వర్షాలకు రసాయన పరిశ్రమల నిర్వహకులు వారి పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను చిన్న కాలువలు చేసి బయటకు వదులుతున్నారు. ఇవి వర్షపు నీటిలో కలిసి ఎపిఐఐసి కార్యాలయం ముందు చిన్నచెరువులా నిలిచిపోయింది. ఈ ప్రాంతం వద్దకెళ్తే రసాయనాల దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ భూగర్భ జలాలు సైతం కలుషితం అయిన పరిస్థితి కన్పిస్తోంది. పరిస్థితి ఇంత భయానంగా ఉన్నా కాలుష్య నియంత్రణ, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు.
నిబంధనలు ఇవే.....
          రసాయన, స్టీల్‌ పరిశ్రమల యాజయాన్యలు కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు వారి పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను వారి పరిశ్రమ ప్రాంగణంలో నిలువ చేసి శుద్ది చేయాలి. ఘన వ్యర్థలను నిలువ చేసి జనసంచారం లేని, నివాసాలకు దూరంగా సుమారు 50 అడుగుల లోతు వ్యర్థలను వేసి దానిపై మట్టి వేసి పూడ్చాల్సి ఉంది. దీంతో పాటు కాలుష్య మండలి నిబంధనలు పాటించాలి. అయితే పురం పారిశ్రామిక వాడిలో ఇలాంటివేవీ అమలుకానట్లు తెలుస్తోంది.
అధికారులు స్పందించాలి
ఎం.ఇంతియాజ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి.

        తూముకుంట పారిశ్రామికవాడలో ఉన్న పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తిని కాలుష్యం నెలకొంది. దీంతో పారిశ్రామికవాడ చుట్టు పక్కల ఉన్న గ్రామలు కాలుష్యం కోరల్లో చిక్కుకుని కొట్టిమిట్టాడుతున్నాుుం. కాలుష్య నియంత్రణ అధికారుల బృందం పర్యటించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. రసాయనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. ఇప్పటికైనా తూముకుంట పారిశ్రామికవాడలో అధికారులు పర్యటించి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.