మాట్లాడుతున్న మంత్రి కాకాణి
పునరావాస కార్యక్రమాలు వేగవంతం
నెల్లూరు:ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామానికి సంబంధించి పునరావాస కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్, ఆర్డిఓ మలోలతో కలిసి నేలటూరు, ఎస్‌సి కాలనీ, నేలటూరు పాలెం గ్రామస్తులు, అధికారుల సమక్షంలో పునరావాస చర్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కి సంబంధించి అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ఉంటే వారి పేర్లను కూడా మార్చి 31 లోగా జాబితాలో నమోదు చేయాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించి ఏప్రిల్ 31 లోగా తుది జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటివరకు మొదలైన 309 ఇళ్ల నిర్మాణాలకు గాను 55 ఇళ్లు పూర్తయ్యాయని, మరో 53 ఇళ్లను జూన్ లోగా, మిగిలిన ఇళ్లను అక్టోబర్లోగా పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఇంకా మొదలు కావాల్సిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, ఆస్తుల వివరాల నమోదు మొదలైన విషయాలపై ప్రత్యేక దష్టి సారించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ముత్తుకూరు తాసిల్దార్ మనోహర్ బాబు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేలటూరు గ్రామస్తులు పాల్గొన్నారు.










