Jul 13,2022 22:43

ప్రజాశక్తి - అవనిగడ్డ : కృష్ణానదికి వదర ఉధృతి పెరగడంతో బ్యారేజి దిగువన దివి సీమలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కష్ణా నదికి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా దిగువకు విడుదల చేయడంతో దివిసీమ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పులిగడ్డ అక్విడెక్ట్‌ వద్ద కష్ణా నదిలో వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు 45 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే బ్యారేజ్‌ నుంచి విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు చెప్పడంతో అంతగా ప్రమాదం లేదని భావిస్తున్నారు. అయినా వరద తీవ్రత పెరిగితే దివిసీమలోని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాతఎడ్ల లంక, దక్షిణ చిరుగోలంక తదితర గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంటుంది. దీనికి ముందు లంక గ్రామాల్లోని పంట పొలాలన్నీ వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాత హెడ్‌లంక గ్రామం చుట్టూ వరద నీరు చేరి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు పొలాల్లోని పంటలను కాపాడుకోవాలని, అలాగే లంకల్లో ఉండే పశువులను, మేకలను ఒడ్డుకు చేర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకుండా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకైతే దివిసీమ లంకల గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు.
బ్యారేజికి 30 వేల క్యూసెక్కుల వరద నీరు
విజయవాడ : ప్రకాశం బ్యారేజికి 30 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో 35 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో ఐదు వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు పంపుతున్నట్లు బ్యారేజి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పివిఆర్‌ కృష్ణ తెలిపారు. మరోవైపు మునేరు, కట్టలేరు, వైరా ఏరుల నుండి కృష్ణానదిలోకి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది.