Jul 13,2021 20:18

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో, గుంటూరు జిల్లా ప్రతినిధి
ఎగువ నుంచి నీటి ప్రవాహం ఆగిపోవడంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ జెన్‌కో జల విద్యుదుత్పత్తిని నిలిపేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్తు కేంద్రంలో స్విచాఫ్‌ చేశారు. పులిచింతల జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 39.64 టిఎంసిలు ఉన్నాయి. ఎగువన ఉన్న నాగార్జున సాగర్‌లో మూడు రోజుల క్రితం విద్యుదుత్పత్తి నిలిపివేయడంతో పులిచింతలకు ఇన్‌ఫ్లో భారీగా తగ్గింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,770 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 600 క్యూసెక్కులు ఉన్నాయి. దీంతో, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉధృతి భారీగా తగ్గింది. గత నెల 29 నుంచి 11 రోజుల పాటు నాగార్జునసాగర్‌ వద్ద 30 మిలియన్‌ యూనిట్ల, పులిచింతల వద్ద 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ ఎన్‌జెకో అధికారులు ఉత్పత్తి చేశారు. కృష్ణా బేసిన్‌లోని సాగర్‌, పులిచింతల వద్ద ఇటీవల తెలంగాణ విద్యుదుత్పత్తి చేసిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు.