Dec 30,2022 19:30

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడా

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని సిటీ కళ్యాణ మండపంలో రాజంపేట మండల స్థాయి గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ-వాలంటీర్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కరోనా లాంటి విపత్తుల పరిస్థితులలో వాలంటీర్ల సేవలు అదుÄతేమని కొనియాడారు. కుల, మత, రాజకీయాలకతీతంగా.. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధి సాగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి తప్పుకునే సమయానికి రాష్ట్రంలో 39 లక్షల పెన్షన్లు మాత్రమే పంపిణీ అయ్యేవని, ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 64.45 లక్షల పెన్షన్ల పంపిణీ ప్రతినెల 1వ తారీఖున జరుగుతుందన్నారు. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో గ్రామాలలో పర్యటించినప్పుడు అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారని, జగన్మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేక ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం సచివాలయ కన్వీనర్లకు, వాలంటీర్లకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.