పథకాలన్నింటికీ అర్హతే ప్రమాణికం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : కుల, మత, పార్టీలకతీతంగా అర్హతే ప్రమాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆత్మకూరు అర్బన్ పరిధిలో నూతనంగా మంజూరైన 124 పించన్లు, రూరల్ పరిధిలో మంజూరైన 145 పింఛన్లను అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ఎన్నికలలో ఇచ్చిన హామిలలో భాగంగా ప్రతి సంవత్సరం పింఛను నగదు పెంచి లబ్ధిదారులకు అందజేస్తున్నారని తెలిపారు. నూతనంగా పింఛను మంజూరైన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా తాను కొత్తగా వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తనకు పెద్దగా అవగాహన లేదని, శాససనభ్యునిగా ఎన్నికైన అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి పూర్తిగా తెలిసిందన్నారు. ఏ కుటుంబానికి ఏ సంక్షేమ పథకం ఎప్పుడు అమలు అయ్యిందో పూర్తిగా తెలియజేస్తూ సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందజేస్తున్నారని, ప్రతి కుటుంబంలో ముఖ్యమంత్రికి దీవెనలు అందుతున్నాయని తెలిపారు. మాజీమంత్రి మేకపాటి గౌతంరెడ్డి నియోజకవర్గంలో చేయాలనుకున్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నట్లు ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరంను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఎఫ్‌డిఎఫ్ ద్వారా మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, అదేవిధంగా పలు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేసిన సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించే దిశగా ఎడిఎఫ్ పనులు సాగుతున్నాయని వివరించారు. ఎడిఎఫ్‌కు అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. జెడ్‌పి బాలికోన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ కరుణకుమారి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, వైసిపి పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, సిటకెట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఎస్‌సిసెల్ అధ్యక్షుడు కొండ వెంకటేశ్వర్లు, నోటి వినరు కుమార్ రెడ్డి, పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, సర్పంచులు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










