Jul 07,2021 13:23

హైదరాబాద్‌ : నగరానికి పచ్చదనాన్నిచ్చేది... ఆహ్లాదకర వాతావరణాన్నిచ్చేది చెట్లే కదా..! మరి ఆ చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత .. సంరక్షణ అందరిపైన ఉంటుంది కదా..! అందుకే హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇనఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటి) పరిశోధకులు ఓ వినూత్నమైన ప్రయత్నం చేశారు. అదేమిటంటే.. అసలు నగరంలో ఎన్ని చెట్లు ఉన్నాయి... అవి ఎన్ని కిలోమీర్ల చొప్పున.. ఎంత సంఖ్యలో ఉన్నాయి... వాటి కాలమెంత? సాంద్రత ఎంత? అనే దానిపై పరిశోధన చేశారు. వారి పరిశోధన ఆధారంగా ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. అదేమిటంటే.. నగరంలో ఏయే రోడ్లలో.. ఎక్కడెక్కడ ఎన్నేసి చెట్లు ఉన్నాయనేది ఓ మ్యాప్‌లో తెలుపుతుంది. ఇలా వారు చెట్ల గురించి సమాచారం తెలుసుకోవడానికి ఐఐటి హెచ్‌లోని సెంటర్‌ ఫర్‌ విజువల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ల్యాబ్‌లో పరిశోధనా సహచరుడు అర్పిత్‌ బహేటి (23) తన బైక్‌ హోండా యాక్టివా వెనుక సీటుపై తన హెల్మెట్‌ని పెట్టి.. దానిపై కెమెరాని అమర్చి.. దానిద్వారా చెట్ల ఫుటేజీని తీసుకున్నారు. ఇలా ఎవరైనా సరే చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై అర్పిత్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రకృతి ప్రేమికులు రోడ్డుకు ఎడమవైపున వాహనాన్ని ఉంచి.. అంటే ఒక్క బైకే కాదు.. ఏ వాహనంపైన అయినా సరే అందులో కెమెరాని అమర్చి చెట్లను వీడియోలో.. ఫొటోలతో బంధించి పరిశోధకులకు అందించగలిగితే.. వారు కనుగొన్న ట్రీస్‌ మ్యాప్‌కి ఎంతో సహాయపడుతుందని' అని ఆయన అన్నారు. ఇక ఈ ట్రీస్‌ మ్యాప్‌లో కిలోమీటరుకు 50 చెట్లు ఉంటే దానిని ముదురు ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది. తక్కువ చెట్లు సంఖ్య ఉంటే నలుపు రంగులో చూపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం పరిశోధకుల బృందంలో ప్రొఫెసర్‌ సి.వి. జవహర్‌తో పాటు బహేటి పనిచేశారు. అలాగే ఈ బృందంలో సభ్యులుగా.. డాక్టర్‌ రోహిత్‌ సలూజా, డాక్టర్‌ అన్బుమాని సుబ్రమణియన్‌, ప్రొఫెసర్‌ రవి కిరణ్‌ సర్వదేవభట్ల ఉన్నారు. వీరు కనుగొన్న ఈ పద్ధతి ద్వారా వివిధ నగరాల్లోని చెట్ల సంఖ్యను కనుగొనడానికి ఇది ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. అలాగే ఈ పద్ధతి ద్వారా... పట్టణ ప్రాంతాల్లో అటవీ నిర్మూలన ప్రయత్నాలను అంచనా వేయడానికి ఈ సాధనం సహాయపడుతుందని పరిశోధక బృదం అభిప్రాయపడింది.