Jan 12,2023 19:30

సంక్రాంతి కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మేడా

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌: పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లతోపాటు పురపాలక శాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రస్తుత శీతాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో అలసత్వం వహించకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, కౌన్సిల్లర్లతో పురపాలక పరిధిలోని పలు సమస్యల పైన చర్చించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పట్టణాభివ ద్ధికి కావలసిన చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణాభివృద్ధే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం జీసస్‌ హైస్కూల్‌లో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలను ఘనంగా జరపాలని మేడా అధికారులను ఆదేశించారు. ముగ్గుల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌ తదితర పోటీలను నిర్వహించాలన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కౌన్సిలర్లు, అధికారులతో కలిసి సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.