- వాటా నిధులివ్వని కేంద్రం
- నోరు మెదపని రాష్ట్ర సర్కారు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు బీమా సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నెలకొల్పదలచిన ఇన్సూరెన్స్ కంపెనీ పత్తా లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) వద్ద ఎపి సర్కారు అభ్యర్ధన మూలుగుతోంది. ఐఆర్‌డిఎఐ పలుమార్లు అభ్యంతరాలు, సందేహాలు వెలిబుచ్చడమే కాకుండా వివరణలు కోరడం, ప్రభుత్వం సమాధానాలు పంపడంతోనే కాలం గడిచిపోతోంది. ఇన్సూరెన్స్ కంపెనీపై ఎటూ తేలకపోవడంతో పంటల బీమా భారం మొత్తం ప్రభుత్వమే మోస్తోంది. కేంద్రానికి చెందిన ఫసల్, వాతావరణ ఆధారిత బీమా పథకాల నుండి ఎపి వైదొలగడంతో రెండున్నరేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. దాదాపు రూ.1,500 కోట్లు కేంద్రం ఎగనామం పెట్టినట్లు సమాచారం. ఐఆర్‌డిఎఐ వద్ద దరఖాస్తు పెండింగ్ పడినా, కేంద్రం రైతుల ప్రీమియంలో తన వాటా ఇవ్వకపోయినా ఎపి సర్కారు గమ్మునుందని ఆరోపణలొస్తు న్నాయి.
రెండేళ్లు దాటినా...
కేంద్ర బీమా పథకాల అమలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించడంతో రైతులకు న్యాయం జరగట్లేదని భావించిన వైసిపి ప్రభుత్వం సొంతంగా 'ఎపి జనరల్ ఇన్సూరెన్స్‌్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎపిజిఐసిఎల్)ను 2013 కంపెనీల చట్టం కింద నమోదు చేయించేందుకు ఆర్థిక శాఖ 2019 డిసెంబర్ 20న జిఒఎంఎస్ నెం.157 జారీ చేసింది. రూ.101 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ప్రతిపాదించింది.
ప్రభుత్వ అధికారులే షేర్ హోల్డర్లు, ప్రొమోటర్లు. కంపెనీల రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్‌కు ఐఆర్‌డిఎఐ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఒసి) ఇవ్వాలి. డాక్యుమెంట్ల తయారీకి 2020 మే 19న కంపెనీ సెక్రటరీకి రూ.83.13 లక్షలు మంజూరు చేస్తూ జిఒఆర్‌నెం.1396 జారీ చేశారు. రెండేళ్లకుపైగా ఐఆర్‌డిఎఐ వద్ద తెమలకుండా ఉంది. దాంతో ప్రభుత్వం 2019-20 రబీ నుండి సొంత నిధులతో ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది.
1500 కోట్లు రావాలి
కేంద్రం 2016 ఖరీఫ్ నుండి ఫసల్, తాజా పరిచిన వాతావరణ ఆధారిత బీమాలను తీసుకొచ్చింది. అప్పటి వరకు ప్రభుత్వరంగంలోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎఐసి) మాత్రమే పంటల బీమా అమలు చేసేది. కేంద్రం ప్రైవేటు కంపెనీలనూ ఆ రంగంలోకి ప్రవేశపెట్టింది. వేలంలో కంపెనీలు నిర్ణయించిన ప్రీమియం శాతంలో, ఖరీఫ్‌లో అయితే రైతుల వాటా 2 శాతం, రబీలో 1.5 శాతం. హార్టికల్చర్ తోటలకు 5 శాతం. రైతుల వాటా పోను మిగిలిన ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పెట్టుకోవాలి. కాగా ఏ కంపెనీతోనూ సంబంధం లేకుండా, కేంద్రం నుండి విడగొట్టుకొని, ఉచిత పంటల బీమా తెచ్చాక, మొత్తం ప్రీమియం, క్లెయిముల సెటిల్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. 2019-20 రబీ, 2020 ఖరీఫ్, 20-21 రబీ, 2021 ఖరీఫ్, 21-22 రబీ...ఐదు సీజన్ల బీమాకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్రం ప్రతిపాదించిన ఫసల్, వాతావరణ బీమా మార్గదర్శకాలనే రాష్ట్రం అమలు చేస్తున్నప్పటికీ, ప్రీమియంలో తన వాటాను కేంద్రం, రాష్ట్రానికి విడుదల చేయడంలేదు. ఐదు సీజన్లకూ కలిపి రూ.1,500 కోట్ల వరకు కేంద్రం ఇవ్వాలి. కాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ఎపి సర్కారు కేంద్రాన్ని అడగట్లేదు. మరోవైపు బీమాకు ఇ-క్రాప్ నమోదు తప్పనిసరి చేయడం, పలు షరతుల వలన రైతులు బీమా పొందలేకపోతున్నారు.










