Feb 08,2023 18:50

సమావేశంలో మాట్లాడుతున్న విజయప్రతాప్‌రెడ్డి

ఎపి ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సిహెచ్‌.విజయ ప్రతాప్‌రెడ్డి
ప్రజాశక్తి-రాయచోటి : ఆహార భద్రత చట్టం-2013ను పటిష్టంగా అమలు చేయాలని ఎపి ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సిహెచ్‌.విజయ ప్రతాప్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జాతీయ ఆహార భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 6, 7వ తేదీలలో రెండు రోజుల పాటు రైల్వేకోడూరు, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు, రాజంపేట, లకిరెడ్డిపల్లె, సంబేపల్లి, గుర్రంకొండ మండలాలలోని చౌక దుకాణాలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్స్‌, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు పరిశీలించానని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పంపిణీ, చౌకదుకాణాల ద్వారా నిత్యవసరాల పంపిణీకి సంబంధించి అక్కడక్కడ చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఎపి స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌, జాతీయ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ 2013కు లోబడి పనిచేస్తున్నారు. ఈ యాక్ట్‌ నియమ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం సరఫరా, చౌక దుకాణాల ద్వారా రేషన్‌ పంపిణీ సక్రమంగా జరగకపోతే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పౌరసరఫరాల అధికారులు తగు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోందని విద్యార్థులకు మెనూప్రకారం భోజనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. రక్తహీనతతో బాధపడే వారందరికీ కోడిగుడ్లు, పౌష్టికాహారం అందేటట్లు చూడాలన్నారు. పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఐసిడిఎస్‌ అధికారులకు ఉచించారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం క్రమం తప్పకుండా భోజనం ఇవ్వాలన్నారు. రేషన్‌ షాపుల ద్వారా నిత్యవసరాల పంపిణీలో సమస్యలు తలెత్తినట్లయితే సహించేదలేదని హెచ్చరించారు. జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చౌక దుకాణాలు, వసతి గృహాలలోని సమస్యలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ తమీంమ్‌ అన్సారీయ మాట్లాడుతూ జిల్లాలో 54 వసతి గృహాలు ఉన్నాయన్నారు. ప్రతి వసతి గృహానికి ఒక నోడల్‌ ఆఫీసర్ను నియమించామన్నారు. వీరు హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై వైద్యాధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. చౌక దుకాణాల ద్వారా రేషన్‌ పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇకనుంచి అంగన్వాడి కేంద్రాలు చౌక దుకాణాలు తరచూ విజిట్‌ చేయడం జరుగుతుందని అధికారులందరూ జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో ఎపి ఫుడ్‌ కమిషన్‌ సహాయ సంచాలకులు పి.సురేష్‌, డిఎస్‌ఒ రఘురాం, డిఇఒ రాఘవరెడ్డి, ఐసిడిఎస్‌ ఇన్‌ఛార్జి పీడీ ధనలక్ష్మి, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి జాకిర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన విజయ ప్రతాప్‌రెడ్డి
ఎపి ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సిహెచ్‌.విజయ ప్రతాప్‌రెడ్డి కలెక్టర్‌ గిరీషకు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి జిల్లాలో రెండు రోజులుగా వివిధ మండలాలలోని చౌకదుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్స్‌, వసతి గృహాలను విజిట్‌ చేసి అక్కడ గుర్తించిన చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు సూచించడం జరిగిందని ఆయన కలెక్టర్‌కు తెలిపారు.