ప్రజాశక్తి-రామాపురం : మండలంలోని రామాపురం, నీలకంఠరావుపేట, గువ్వలచెరువు పశువైద్య ఆస్పత్రులను బుధవారం అన్నమయ్య జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్ పిళ్లై ఆకస్మిక తనిఖీ చేపట్టారు. నీలకంఠరావుపేట పశువైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువులకు సంబంధించి వైఎస్‌ఆర్ బీమాలో కొద్దిపాటి మార్పులు ప్రభుత్వం చేసిందని చెప్పారు. జగనన్న పాల నిల్వ భవన నిర్మాణాలను పరిశీలించామన్నారు. అన్నమయ్య జిల్లాలోని రామాపురం, నూలివీడు, బురకాయలపేట, సిద్ధవరం గ్రామాల్లో ఐదు పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాల కేంద్రం నిర్మాణాల కోసం ఒక్కొక్కరికి రూ1.90 లక్షలతో భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పశువులకు జబ్బులకు మందుల కొరత ఉండదన్నారు. ఇప్పటికే మందులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మేకలకు, గొర్రెలకు సంబంధించి సామాజిక నత్తల నివారణ మందులు అందజేశామని తెలిపారు. కిసాన్ క్రెడిట్‌కార్డు ఉన్న పాడి లబ్ధిదారులకు బ్యాంకు నుంచి రూ.1.60 లక్షల రుణం మంజూరు చేస్తామని చెప్పారు. పశు గ్రాసం కింద రైతులకు 75 శాతం సబ్సిడీతో 370 టన్నులు గడ్డి విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఆయన వెంట పశు వైద్య అధికారులు ప్రవీణ్ కుమార్, సరోజ కీర్తన, విష్ణువర్ధన్ రెడ్డి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.










