Jun 03,2023 21:30

మైదుకూరు బహిరంగ సభలో మాట్లాడుతున్న నారాలోకేష్‌

చాపాడు :మైదుకూరు నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడి రైతు లు జీవనం సాగిస్తున్నారని, ఇక్కడి ప్రధాన పంటలైన పసుపు, ఉల్లి, వరి రైతుల సమస్యలకు టిడిపికి అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చూపుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సూచించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగ సభను నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజోలి ఆనకట్టను నిర్మిస్తామని శిలాఫలకం వేసి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బిసిలు పడుతున్న కష్టాలు తాను చూశానని 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు ఇచ్చారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బిసిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొ స్తామన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ దగ్గర నుంచి డాక్టర్‌ అచ్చెన్న వరకూ జగన్‌ పాలనలో దళితుల్ని కిరాతకంగా చంపారన్నారు. దళితుల్ని చంపడానికి జగన్‌ వైసిపి నాయకులకు స్పెషల్‌ లైసెన్స్‌ ఇచ్చాడన్నారు. 27 దళిత సంక్షేమ కార్య క్రమాలు రద్దు చేసాడన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తామని జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. పోతిరెడ్డిపొడు హెడ్‌రెగ్యులేటర్‌, తెలుగుగంగ కాలువ, కెసి కెనాల్‌, నిప్పులవాగు కాలువల సామ ర్థ్యాన్నిపెంచుతామని హమీ ఇచ్చి జగన్‌ మరిచారన్నారు.పెండింగ్‌ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. గత టిడిపి హయాంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజ్‌ ఇలా అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో కాలేజీలు, కమ్యూనిటీ భవనాలు కట్టింది టిడిపి అని గుర్తుచేశారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కడప జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆయన కుమారుడు మహేష్‌ యాదవ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకేష్‌ను కలిసిన ఉల్లి రైతులు
ఉల్లి రైతులు యువనేత లోకేష్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో పండించే విదేశీరకం కెపి ఉల్లి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చే యాలని కోరారు. కెపి రకం ఉల్లి ఎకరా పంటకు 15 నుండి 20 క్వింటాళ్ల దిగు బడి మాత్రమే వస్తోందని ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. క్వింటాకు రూ.10వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని, ఆగష్టు నెలలో ఉల్లి కొనుగోలు కేంద్రం పెట్టి కొనుగోలు చేయాలన్నారు. దళారులు పంట కొనుగోలు చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లి రైతులకు న్యాయం చేయాలని కొరగా నారా లోకేష్‌ స్పందిస్తూటిడిపి అధికారంలోకి వచ్చాక మైదుకూరులో ఉల్లి కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి రైతులను ఆదుకుంటామని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, దళారీల దోపిడీ బారినుంచి కాపాడతామన్నారు. ఉల్లి రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందజేస్తామని హమీ ఇచ్చారు.